Tuesday, 5 November 2013

p.g.wodehouse

పి.జి.వోడ్ హౌస్ కి చెందిన విభాగంలో బహుశా ఆయన ఒక్కరే ఉండిఉంటారు ఆ కాలంలో. ఆయనే స్వయంగా కొందరు ' హాస్య రచయితలను ' పేర్కొన్నా వారెవరూ ఇంత వాసికెక్కలేదు, ముఖ్యంగా ఇంగ్లీష్ తమ మాతృభాష కాని పాఠకులలో. డికెన్స్, మార్క్ ట్వేన్ , ఆస్కార్ వైల్డ్ వంటి ప్రసిద్ధులు కొంత అధిక్షేప హాస్యం రాసి ఉన్నా, ఇలా మొత్తం కథలూ, కథనమూ 'నాన్ సీరియస్ ' గా రాసినవారు లేరేమో.ఆ తర్వాతివారిలో డగ్లస్ ఆడంస్, టెర్రీ ప్రాచెట్ కొంతవరకూ ఆ పద్ధతిలో రాస్తారు, నేను చదివినంతవరకూ. వోడ్ హౌస్ రచనని టాం అండ్ జెర్రీ కార్టూన్ లతో పోల్చాలని అనిపిస్తుంది.[ ఇది వోడ్ హౌస్ స్థాయిని దించటం అయితే కాదు. ] ఏవేవో గందరగోళాలూ హడావిళ్లూ జరుగుతాయే కాని చివరికి ఎవరికీ ఏమీ అవదు. ప్రేమలూ ఆశాభంగాలూ ఆర్ధికపరమైన ఇబ్బందులూ...అన్నీ ఉంటాయి, అన్నీ హాస్యంగా కొనసాగి ' సుఖం ' గా ముగుస్తాయి.

స్టీఫెన్ ఫ్రై ఇలా అంటున్నారు. ' ఓడ్ హౌస్ వచనం అసాధారణమైనది.అద్భుతమైన ఆ శైలీ, ఐంద్రజాలికమైన ఆ శిల్పమూ లేకపోతే  ఇలా రాయటం చాలా పిల్లతరహా గా పరిణమించి ఉండేది. ఈయన ఎలా రాస్తారంటే సందేహానికి చోటు లేనట్లుగా, ఎలాంటి 'విమర్శ ' ని అయినా అర్థం లేకుండా చేసేటట్లుగా...!సాధువులలో మాత్రమే ఉంటుందేమో అనిపించే స్వచ్చత ఉంటుంది ఇక్కడ.ఇంత అమాయకమైన సాహిత్యపు ప్రపంచాన్ని సృష్టించేందుకు రచయిత వైపునుంచి ఎంతో కఠినమయిన పరిశ్రమ, కళాత్మకత ఉండి తీరాలి. ఈ లోకాలలోకి మనం ఎంత తేలికగా వెళ్లిపోతామంటే ఈ రచయిత సైతం అంతటి అమాయకుడేమో అనేసుకుంటాము. '

ముళ్లపూడి వెంకటరమణ గారి మీద ఈయన ప్రభావం ఉందని అంటారు. ఎం బి యస్ ప్రసాద్ గారు జీవ్స్ ని అచలపతి గా స్వేచ్చానువాదం చేశారు.పాతరోజులలో కోమలా దేవి అనే రచయిత్రి ఇలాంటి ప్రయత్నమే చెశారు.
ఒరిజినల్ లు చదవటం నిజమయిన బ్రహ్మానందం ! ఎవరయినా మొదలుపెట్టాలని అనుకుంటే ' డాంసెల్ ఇన్ డిస్ట్రెస్ ' ముందు చదవమని నా సూచన [నేను అలాగే చేశాను కాబట్టి :)   ] అందరికీ తెలిసిన జీవ్స్ సీరీస్ తో పాటు అంకుల్ ఫ్రెడ్ , బ్లాండింగ్స్ కాజిల్, ఉక్రిడ్జ్..ఇంకా చాలా చాలా. ప్రతిభావంతులయిన రచయితలు దీర్ఘాయుష్మంతులవటమూ విరివిగా రాసి ఉండటమూ చదువరుల అదృష్టం. ఈ మాట విశ్వనాథ వారికీ, కుటుంబరావు గారికీ, అగాథా క్రిస్టీ కీ, ఎర్ల్ స్టాన్లీ గార్డ్ నర్ కీ వర్తిస్తుంది ఆయా స్థాయిలలో.

దేవాదిదేవ

మైసూరు వాసుదేవాచారి గారు త్యాగరాజస్వామి ప్రశిష్యులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ [ బిలహరి లో పరిదానమిచ్చితే,షణ్ముఖప్రియలో మరివేరె దిక్కెవరయ్య రామా చేసినవారు ]గారికి శిష్యులు. మైసూరులోని మధ్వకుటుంబం లో జన్మించి తొంభై ఆరేళ్ల పరిపూర్ణ జీవితాన్ని పవిత్రంగా గడిపి రుక్మిణీదేవి గారి కళాక్షేత్ర లో బోధిస్తూ 1961 లో దివంగతులైనారు. వీరు వాగ్గేయకారులు. సంస్కృతం లోనూ, కన్నడం లోనూ రచనలు చేసినా మన అదృష్టం కొద్దీ ' సంగీతభాష ' అయిన తెలుగులో అనర్ఘరత్నాలవంటి కీర్తనలు చేశారు. తన తెలుగుభాషా జ్ఞానం 'త్యాగరాజ భిక్ష ' అని చెప్పుకొనేవారట
.'బ్రోచేవారేవరురా ' వాసుదేవాచారి గారు కరుణించిన సుధారసం.ఆ  ఆర్ద్రతనీ అచంచలవిశ్వాసాన్నీ వింటూనే ఉన్నాము వేర్వేరు కంఠాలలో. ..నావరకు నాకు ఇది ముగుస్తూనే మళ్లీ వినాలని అనిపించే కీర్తన.
సునాదవినోదిని లో చేసిన ' దేవాదిదేవ ' కి బాలమురళీకృష్ణ గారి గొంతులో ఎంతగా ప్రాణప్రతిష్ట జరిగిందంటే ఆ కీర్తన బాలమురళి గారి రచనే అని అనుకునేవారట. ఈ విషయం వాసుదేవాచారి గారికి చెప్తే ఆయన హాయిగా నవ్వేసి ' అవును, అది బాలమురళిదే ' అన్నారట. సునాదవినోదినిని ఏమాత్రం తటస్థంగా పాడినా విషాదం ధ్వనిస్తుంది. బాలమురళి గారు ఏ పాటనయినా చిరునగవు మోముతోనే పాడతారు కదా. ఈ కీర్తన ఆయన గొంతులో దేవాదిదేవుని దయ సిద్ధించిన చిదానందపూర్ణమైన ఉత్సవం లాగానే వినిపిస్తుంది.ఆ కీర్తన భావాన్ని బాలమురళి గారు వివరించిన వీడియో నీ, పాడిన వీడియోనీ షేర్ చేస్తున్నాను. వాసుదేవాచారి గారి పైన తీసిన తమిళ దాక్యుమెంటరీ లింక్ కూడా ఇస్తున్నాను.సబ్ టైటిల్స్ ఉన్నాయి
http://www.youtube.com/watch?v=l9bDUmPeOpM


http://www.youtube.com/watch?v=wEr-xk_HQ70

http://www.youtube.com/watch?v=VijICZhX2f0


Mysore Vasudevachariyar

virataparvam 1

[బహుశా] కొడవటిగంటి కుటుంబ రావు గారు చందమామ లో చెప్పిన మహాభారతం ఆ కథ పైన రుచిని కలిగించింది మొదటగా. తర్వాత ఆ కథ ఆధారంగా తెలుగులో తీసిన సినిమాలు. విరాటపర్వం ఎక్కువగా నచ్చుతూ ఉండేది. 'రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా సంజయ విధినేమందును కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్ ' అని తెనాలి రామకృష్ణకవి అన్నా ఆ కథ ఆహ్లాదాన్నే కలిగిస్తూ ఉండేది . ఎందుకు అలాగ అని తర్కించుకోలేదు ఎప్పుడూ. ఈ మధ్యన ఆలోచిస్తూ ఉంటే కారణం తట్టింది. నేను అనుకున్న కారణాలే తితిదే వారి విరాటపర్వసంపుటం ముందుమాటలోనూ రాసిఉండటం సంతోషాన్ని కలిగించింది. సమర్థులూ తేజోవంతులూ అయినవారు తమ నిజస్వరూపాలను దాచుకునే ప్రయత్నం చేస్తూండగా అది పూర్తిగా నెరవేరక చూసేవారికి వీరెవరో ఉద్దండులు సుమా అనిపిస్తూనే ఉంటుంది. తాము నిజంగా ఎవరో వారినే ఇదివరలో సేవించి ఉన్నాము అని పాండవులూ ద్రౌపదీ చెప్పటం సరదాగా ఉంటుంది. ఇలా కథ నడపటంలో ఇతర పాత్రలకు తెలియనిది మనకి తెలుసు కదా అనే సంతోషం చదువరులకి. కీచకుడి వృత్తాంతం మొదట్లో బాధను కలిగించినా అతని సం హారం జరిగిపోయి తృప్తి పడతాము. ఆ తర్వాతి కథ ఏమయినా, అభిమన్యుడి జీవితం ఎలా పరిణమించినా అక్కడికి కల్యాణం గానే తోస్తుంది. తిక్కన గారి భారతరచన ఈ పర్వంతోనే మొదలయిందని గమనించాలి. ఆయన శిల్పలక్షణాలలో ముఖ్యమైన నాటకీయత గొప్పగా విస్తరించి చూపటానికి అనువైన పర్వం ఇది. చివరివరకూ అందరూ నటిస్తూనే ఉండే నర్తనశాల. విరాటపర్వం గురించిన  ప్రస్తావన కి కొనసాగింపుగా ఈ పద్యాన్ని చదవండి.కీచకుడు ద్రౌపది వెంటబడి పీడించటాన్ని చూసిన భీముడు విపరీతంగా కోపోద్రిక్తుడైనాడు. కీచకుడిని శిక్షించటానికి దగ్గరలో ఉన్న పెద్ద చెట్టును పెకలించబోతున్నాడా అనే ఘట్టంలో అంతటి ఆవేశం లోనూ అనుమతికోసం అన్నగారివైపు చూశాడట. అప్పుడు ధర్మరాజు
మ.వలలుండెక్కడ జూచె నొండెడ నసేవ్య క్ష్మాజముల్ పుట్టవే?
ఫలితంబై వరశాఖలొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగా
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపగా నేటికిన్?     అన్నాడు. ' ఇది నీకెక్కడ కనబడిందిరా, ఇంకేమీ దొరకలేదా ఏమిటి ? ' అని ' అని ఇప్పటికీ అంటాము కదా మనం. చదువుకున్న కుటుంబాలలో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ' వలలుండెక్కడ చూచె ' అని వాడేవారట. భీముడి అజ్ఞాతవాసపు నామధేయం వలలుడని. ఫలవృక్షాన్ని వంటకట్టెల కోసం నరుకుంతావా అని నిగూఢంగా అంటున్నాడు. విరాటరాజుకి[ఆయన కీచకుడి పైన ఆధారపడి ఉన్నాడు] హాని తలపెట్టటం లోని తొందరపాటు తమకు నీడ లేకుండా చేస్తుందని. ఇక్కడ అసేవ్య వృక్షాలు [సేవింపదగని చెట్లు ] అంటే కౌరవులని , కోపంచూపవలసింది వారిమీదననీ తాత్పర్యమని పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గారి వ్యాఖ్యానమట. [ క్ష్మాజములు అంటే భూమి నుండి పుట్టినవి, చెట్లు .విలసత్ అంటే ప్రకాశిస్తూ ఉన్న. ఉపాశ్రిత ప్రతతి అంటే ఆశ్రయించిన జనసమూహం. ]

malati chandur garu

70 ల చివర్లో ఇంగ్లీష్ చదువుకున్నవారు గౌరవించిన ఒకే రచయిత్రి మాలతీ చందూర్ గారు. అలాంటివారిలో ఒకరు మా మామయ్య.ఆ పన్నెండు పదమూడేళ్ల వయసులో నేను సరయిన పుస్తకాలు చదవటలేదూ అని చాలా అక్కర ఉండేది ఆయనకి. నా తెలుగు మీడియం ఇంగ్లీష్ తో ఏ పుస్తకాన్ని ప్రయత్నించాలన్నా కష్టంగానే ఉండేది. ' నవలలు, నారీమణులు ' అనేది ఆవిడ ఆంగ్లనవలలా పరిచయాల సంపుటి.' ఇదిగో చదువు ' అని ఇచ్చాడు ఆయన. గమ్మత్తేమిటంటే ఆవిడ తెలుగు నచ్చేసింది నాకు. అందులో పేర్కొన్న ఏ నవలనీ అప్పుడు చదవలేను అనే' వివేకం ' భాసించింది ఎందుకో. గాన్ విత్ ద విండ్, రెబెక్కా,డోరియన్ గ్రే , ఫౌంటెన్ హెడ్ వంటి కొన్ని తప్పితే నేను చదివిన   ఆంగ్లసాహిత్యమంతా  2000 సంవత్సరం తర్వాత చదివినదే. అందువలన ఆమెని స్వతంత్ర రచయిత్రిగానే అభిమానిస్తాను.రెండు ఎం. యే లు చదివి ఉద్యోగం రాని ఒకాయన నెల్లూరు బాలాజీనగర్ లో లెండింగ్ లైబ్రరీ నడిపేవారు . ' కృష్ణాతీరం ' వంటి పుస్తకాలు కూడా ఉండేవి అక్కడ. కౌసల్యాదేవి గారు, సులోచనారాణి గారు...వీళ్లతోబాటు మాలతీచందూర్ గారి పూర్తి కలెక్షన్ అక్కడే చదివేశాను.' ఆలోచించు ' చదివినప్పుడు కోపం వచ్చింది. ' ఎన్ని మెట్లెక్కినా ' చదివినప్పుడు కాస్త చిరాకేసింది. జీవితపు తెలుపునలుపులనే కాకుండా బూడిదరంగునీ ఆవిడ రాశారని ఆ తర్వాత కొన్ని యేళ్లకిగానీ అర్థమవలేదు. ఆవిడ రచనలు అన్నింటినీ ఈ రోజుకీ గౌరవిస్తాను.తను రాసిన ప్రతినవలా తన దృక్పథాన్ని మొత్తంగా చెప్పేయాలని ఆమె అనుకునేవారు కాదనుకుంటాను. ఒక్కొక్క పార్శ్వం గురించి, అదీ కొన్ని కోణాలనుంచే, రాసేవారనిపిస్తుంది.'కలలవెలుగు ' , ' ఏమిటీ జీవితాలు ' వంటి నవలని ఆవిధంగానే అర్థం చేసుకోవాలి . ఎంతమాత్రమూ ఎక్కడా నిలిచి ఆగిపోని రచన అది. ' జయ-లక్ష్మి' రాసిన,' శతాబ్ది సూరీడు ' రాసిన, హృదయనేత్రి ' రాసిన రచయిత్రే తక్కినవీ రాశారు. అన్నిటినీ కలిపే సూత్రం నాకయితే కనిపిస్తూనే ఉంటుంది. ఆమె పేరుకు హిందువు అయినప్పటికీ తొలినాటి రచనలలో క్రైస్తవమతపు ప్రశంస కనిపిస్తుంది.ఆ తర్వాత అలా కాకపోయినా సాంప్రదాయాల పట్టింపు కనిపించేది కాదు. ఇది ఆమె ఏదో ఒక వాదాన్ని సమర్థిస్తున్నట్లుగా కనిపింపజేయవచ్చు.అలా చూస్తే 'కాంచనమృగం ', ' వైశాఖి ' వంటి నవలలు అర్థం కావు.'రాగం అనురాగం' ఒక తెలివిగల మరదలు, చదువుకోని బావ..వీళ్ల కథ. ' భూమిపుత్రి ' ఒక సమర్థురాలయిన పల్లెటూరిఅమ్మాయికథ. ' సద్యోగం ' ఒక ఆడపిల్ల  అనాలోచితంగా చేసిన పొరబాటుని దిద్దుకున్న  తీరు . ఆ తర్వాత న్యాయవాదిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో  మోసగించిన వ్యక్తినే వృత్తిరీత్యా రక్షించవలసివస్తే వెనకాడుతుంది. ప్రయత్నించి   ఆ పాతపరిచయస్తుడిని పూర్తి నిర్లిప్తంగా చూడగలిగే స్థితికి వస్తుంది. ఇందులో ఆమె సీనియర్ లాయర్ పాత్ర ఎంతగా, ఎలా ఉంటుందో చమత్కారంగా చూపిస్తారు. 'రాగరక్తిమ ' లో తనని కన్నవాళ్లకోసం తాపత్రయపడుతుంది సంపన్నుల ఇంటికి పెంపుడు వెళ్లిన అమ్మాయి. అయితే తన బాధ్యత తీరిపోగానే పెరిగిన ఇంటికే వెళ్లిపోతుంది. ఏ ఐడియలిజం కీ రచయిత్రి లొంగరు అక్కడ. 'కర్పూరపరాగం ' ఒక అందమైన అమాయక యువకుడి కథ. చురుకైన అమ్మాయి ఒకరు ఇస్కాన్ వంటిసంస్థలో చేరిపోయినఅతన్ని లాక్కొచ్చి పెళ్లిచేసుకుంటుంది.' మనసులోని మనసు ' చాలా ఛాయలు కనిపించే రొమాన్స్. ఆ నవలని పదే పదే చదివినవారు నాకు తెలుసు. ఏ చట్రంలోకీ ఇమడకుండా రాశారు ఆమె. ఆంగ్లసాహిత్యం ఆమెపైన బలంగా ప్రభావం చూపటం ఈ వైశాల్యానికి కారణం అనుకుంటాను. సోమర్సెట్ మాం చాలా ఇష్టం ఆవిడకి. ఇంకొకవైపున విశ్వనాథ, చలం ఇద్దరినీ అభిమానించారు తెలుగులో. జీవితం పట్ల, ప్రపంచం పట్ల ఆమెది సమగ్రమైన [holistic] దృష్టి. ఆమె విశ్లేషించిన క్లాసిక్స్ తో ఆమె రచనలను పోల్చలేము అనేమాటని విశ్వసించను.అంతా అక్కడే, అప్పుడే చెప్పేయాలనే తాపత్రయం లేని రచయిత్రి ఆమె. She really spoke some sense I believe !

our beloved authoress

నా మేనత్తకూతురు తొమ్మిదేళ్లుగా కెనడాలో ఉంటోంది. మొదటగా నేను అడిగిన ప్రశ్న ' ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ మీకెంత దూరం ? ' అని. ఆ స్థలం నాకు, నావంటి ఇంకొందరికి [ వారిలో నా పిల్లలూ, వారి స్నేహితులూ కూడా ఉన్నారు ] ఒక దివ్యక్షేత్రం. లూసీ మాడ్ మాంట్ గోమరీ అనే ఉత్తమరచయిత్రి జన్మించి, నివసించి, తన రచనలలో వర్ణించిన ప్రదేశం అది. ఆన్ ఆఫ్ గ్రీన్ గేబుల్స్ కొన్ని తరాల నుంచీ తరుణవయస్కులనీ తరుణమనస్కులనీ ఆకర్షిస్తూనే ఉంది. ఆ తర్వాత ఆమె ఎన్నో రాశారు, అన్నీ చదవదగినవే. మెలికలు లేని సరళమైన ఆనందం వాటిలో. వైరుధ్యాలనీ ఘర్షణలనీ మనసు ఉపరితలాన్ని దాటిరానీయకపోవటం ఒక కళ, ఒక శాస్త్రం... ఆ విద్యకి ఆమె కూడా పాఠ్యగ్రంథాలు రచించారు. ఇన్ని యేళ్ల తర్వాత నా మరదలు ఆ' తూర్పు కెనడా ' ని సందర్శించి ఛాయాచిత్రాలు   పంపింది. ఆ రచయిత్రి జ్ఞాపకాలని భద్రంగా దాచిఉంచారు అక్కడ. చూస్తూనే సంతోషం కలిగింది, నేను వెళ్లలేకపోయానే అనే దిగులు లేదు. చర్మచక్షువులతో చూసేదే , భౌతికశరీరంతో వెళ్లేదే సమస్తం అవనక్కర్లేదు. ఆ రమ్యమైన ఆవాసాన్ని ఒకసారి కనుగొన్నాక విడిచివచ్చింది ఎప్పుడని !
“After all," Anne had said to Marilla once, "I believe the nicest and sweetest days are not those on which anything very splendid or wonderful or exciting happens but just those that bring simple little pleasures, following one another softly, like pearls slipping off a string.” ― L.M. Montgomery, Anne of Avonlea
“I'd like to add some beauty to life," said Anne dreamily. "I don't exactly want to make people KNOW more... though I know that IS the noblest ambition... but I'd love to make them have a pleasanter time because of me... to have some little joy or happy thought that would never have existed if I hadn't been born.” ― L.M. Montgomery, Anne's House of Dreams

గవాక్షం

అందరికీ తెలిసిన తిలక్ కవిత మొదటి వాక్యాలు '' కిటికీ తెరిస్తే గాలీ వెలుతురుతో పాటు జాలి జీవితపు ధూళీ జ్ఞానమధూళీ కూడా వస్తాయితెరచే కిటికీ బట్టి పరతెంచే పుష్పపరాగం ఉంటుంది గదికీ మదికీ కూడా గవాక్షాలుంటాయి ''

కీట్స్ charmed magic casements అన్నారు,
అసలు మంత్రం మూయకపోవటమే. 

వెలుపలా లోపలా కలిసిపోనక్కర్లేదు.... అసలు తలుపే తెరవనక్కర్లేదు, తాళం తీయనక్కర్లేదు,

 కిటికీ తెరిస్తే చాలు !

SADASIVABRAHMEDRULU

తాపత్రయసాగరమగ్నానాం  ...స్థిరతా నహి నహి రే మానస ' అని పాడుకుంటూ ఉండేదాన్ని నా మెడిసిన్ చదివే రోజులలో... చదువు తప్ప తక్కిన నానారకాలయిన విషయాలన్నీ ఆకర్షిస్తూ ఉండేటప్పుడు. ఆ సంస్కృతం కొద్దిగా  అర్థమవుతూ ఉండటం కాస్త సంబరంగానే ఉండేది. ఉద్దేశ్యపూర్వకంగానే అలా సులభంగా రచించారని తర్వాత అర్థమయింది. ఆ కీర్తన రచించిన సదాశివబ్రహ్మేంద్రులు అద్వైత వేదాంతి, వేదాంత గ్రంథకర్త, మహిమాన్వితులని చెప్పబడే యతీంద్రులు... ఇన్ని అయినా ముముక్షువులు కానివారికి అద్భుతమయిన కీర్తనలు రచించినవారిగానే ముందుగా స్ఫురిస్తారు. పాడుకోవటానికి అనువుగా ఉండేలా క్లుప్తంగా, సరళమైన సంస్కృతంలో ఉంటాయి అన్నీ. 18 వ శతాబ్దంలో కుంభకోణం లో జన్మించిన వీరి తండ్రి పేరు తెలుగు మూలాలని సూచిస్తుందేమో.ఆ పేరు మోక్షసోమసుందర అవధాని. వీరి రచనలు ముఫై పైగా లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క కీర్తననీ రెండుమూడు  రాగాలలో  చేసిఉండటం  విశేషం. శిష్యులూ ప్రచారకులూ అయినవారు వారికి అనుకూలమైన రాగాలను ఎంచుకోవటం బహుశా ఈ వైవిధ్యానికి కారణమేమో. అందరికీ ముందు గుర్తొచ్చేది ' మానస సంచరరే ' [సామరాగం లో చేసినదే ప్రసిద్ధం ] తక్కినవి ఇంచుమించూ బాలమురళీకృష్ణ గారు నిమగ్నులై, అర్థం పట్ల శ్రద్ధ వహించినవారై పాడటం వలన తెలుగునాట వ్యాపించాయి. ' పిబరే రామరసం ' [ అహిర్ భైరవి ] ,భజరే గోపాలం [హిందోళం ] ప్రసిద్ధమైనవే. నాకు ప్రత్యేకించి నచ్చేవి పైన ప్రస్తావించిన ' స్థిరతా నహి నహి రే ' , ' స్మరవారం వారం ' [ పిబరే రామరసం ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు 'పడమటి సంధ్యారాగం ' లో భిన్నంగా వినిపించి సంతోషించారు. అహిర్ భైరవి లోని ఆర్తి తీవ్రతని తగ్గించే ప్రయత్నమేదో జరిగి భావం పలుచనయిందనిపించింది అదే కీర్తనని అనుసరించి ' కథానాయిక మొల్ల ' లో ఎస్. పి.కోదండపాణి గారు చక్కని పాట చేశారు. ' జగమే రామమయం... ఆ చిరునవ్వే అమృతపు జల్లు , అఖిలజగములనేలు ఆ చేతి విల్లు ' హృదయంగమమైన రచన. ]http://satyasense.blogspot.in/ 2010/02/ sadasiva-brahmendra-compositions.html http://www.youtube.com/watch?v=ZXeFj-yOGZo http://www.youtube.com/watch?v=jS2sMzLD9bM http://www.youtube.com/watch?v=LZWbB6eNyLc http://music.raag.fm/Carnatic_Movies/songs-19108-Masters_Choice-Dr_M_Balamuralikrishna http://www.youtube.com/watch?v=Sb-CyfnJpHo