Friday 19 July 2013

రామాయణ కల్పవృక్షం అవతారిక లో పద్యం

ఆ." భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగులకు(బ్రశస్త వాగ్విలక్షణు(డు మురా

రిభట్టునకును రామకథా భాష్యకారులకును మోడ్పు కైఘటించి."

చూసుకుంటూ వస్తూంటే భాసుడు రచించినది ' ప్రతిమ ' ,' అభిషేకం ' నాటకాలు.వీటిని కేరళలో ప్రదర్శించే ' కొడియాట్టం ' ప్రక్రియలో వాడుతూ ఉండగా గుర్తించారట.ప్రతిమానాటకం తెలుగులో ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు అనువదించారనుకుంటాను.దశరథుడి మరణాన్ని మేనమామల ఇంటినుంచి తిరిగివచ్చే భరతుడు తమ పూర్వీకుల ప్రతిమలని నిలిపిన మందిరంలో తెలుసుకోవటం కథావస్తువు.దశరథుడి ప్రతిమ ని ఆసరికే అక్కడ ఉంచుతారు.భాసుడు కాళిదాసుకి ముందరివాడని తెలుస్తూ ఉంది.

కాళిదాసు రఘువంశమూ భవభూతి ఉత్తరరామచరిత్రా సుప్రసిద్ధాలే.భవభూతిదే  ' మహావీరచరిత్ర ' పూర్వరామాయణం గురించి.

దిజ్ఞాగుడు ఒక బౌద్ధ పండితుడు.ఆయన రచన 'కుందమాల ' నాటకం.అంటే మొల్ల [ఒక జాతి మల్లె ]పూల దండ అని అర్థం అనుకుంటాను.సీతాపరిత్యాగం తర్వాత వాల్మీకి ఆశ్రమం చుట్టుపక్కల,అరణ్యంలో,నదీతీరంలో జరిగే  కథ.సీత అల్లిన పూలదండ నదిలో తేలివస్తూ ఉంటే గ్రహించిన రాముడు గ్రహిస్తాడు అది ఆమె పనితనమని.ఇద్దరి కలయికతో సుఖాంతమవుతుంది కథ.

మురారిభట్టు రచించినదీ నాటకమే.' అనర్ఘరాఘవం '..దీన్ని కూడా కేరళ లో కొడియాట్టం ప్రదర్శనలలో ప్రయోగించేవారట.

[భారతదేశానికి ఈ చివర ఉన్న,మొదటిసారిగా విదేశీయులు కాలుపెట్టిన,క్రిస్టియానిటీ,ఇస్లాం ఈ దేశంలో మొదలయిన స్థలమయిన  కేరళలో  ప్రాచీనసంప్రదాయాలు  నిలిచి ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది.'ఐతిహ్యమాల ' అనేది అక్కడి  ప్రాచీనకథల సంకలనం.అందులో వరరుచి దగ్గరనుంచి,అగస్త్యుడి దగ్గరనుంచి ఎందరివో గాథలు ఉన్నాయి.తంత్రాలు,శాపాలు,జ్యోతిష్యం,యక్షులు,దేవాలయాలు...ఇంకా ఎన్ని విషయాలో.ఈ పుస్తకం రెండు సంపుటాలుగానూ,ఒక చిన్న సంగ్రహం గానూ కూడా ఇంగ్లీష్ లో దొరుకుతోంది.]

వాల్మీకి మహర్షికి  తాను పరమభక్తుడయినా అవాల్మీకమయిన కల్పనలు  చేసినవారిని కూడా స్మరించుకున్నారు విశ్వనాథ.ఆయన రామాయణమూ పూర్తిగా వాల్మీకి ని అనుసరించి ఉండదు.ఆయన ఉత్తరకాండ ని రచించలేదు కల్పవృక్షంలో.ఎందుకని?అది ప్రక్షిప్తమనే  ఆయన భావించి ఉంటే తప్ప వదలివేసేవారు కారని నాకు అనిపిస్తుంది.అవునో కాదోగాని ఎంత న్యాయంగా,సుఖంగా ఉంది!

తెలిసినవారెవరయినా వివరిస్తే సంతోషిస్తాను.

Saturday 6 July 2013

మహాశ్వేత

హేమంతంలో ఒక సాయంకాలం.దారికి అటూ ఇటూ పసుపు పొలాలు,అరటితోటలు,వాటి పరాగం.అద్దాలు దించి ఆ గాలిని గుండెనిండుగా  తీసుకుంటే శక్తి వచ్చినట్లనిపించింది అతనికి.ఈ ప్రయాణం బొత్తిగా కొత్తవూరికయితే కాదు ,కాని ఎన్నేళ్లో అయిపొయింది వచ్చి.చదువంతా మహానగరాలలో, పరదేశంలో. తర్వాత వుద్యోగం ఢిల్లీలో.  ఏవో     కొన్ని  ఉన్నభూములనీ చూస్తూవస్తున్న బాబాయి కాలం చేశాక రాక తప్పలేదు ఇప్పుడు. వచ్చే ముందు ఫోన్లలో పరిస్థితులు కనుక్కున్నాడు,ఆ వ్యవహారమంతా ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఆరేడు నెలలు పట్టేటట్లుంది.
ఒక పెద్ద పట్టణానికి దగ్గ్రగా వున్న ఈ పల్లెటూళ్లో ఒక స్వతంత్ర విశ్వవిద్యాలయం వుందనీ,అక్కడ కంప్యూటర్ సైన్స్  లో  డాక్టరేట్  అధ్యాపకుడిగా  కావాలనీ విన్నప్పుడు యథాలాపంగా పెట్టిన దరఖాస్తుకి వాళ్లు  ఉద్యోగం ఇస్తున్నామని చెప్పేశారు.ఒక సంవత్సరం చేసి చూద్దామని నిర్ణయించుకుని ఈ ప్రయాణం.

ఊరిమొదట్లోనే యూనివర్సిటీ..పెద్ద గ్రంథాలయపు భవనం.తన క్వార్టర్స్ కి ఎలావెళ్లాలో కనుక్కునేందుకు ఆగాడు అతను.అప్పటికి పొద్దు వాలిపోతూ వుంది.ఆ మసక  వెన్నెలలో ఆమెని చూశాడు.. కలువపూవులమాల వంటి ఆమెని. ఆంగ్ల కవిత్వం పడచదివిన  అతను పలవరించాడు ..' షి వాక్స్ ఇన్ బ్యూటీ ' .నిజానికి బైరన్ పద్యాన్ని దాటిన అలౌకికత అక్కడ అతని మనసుకి తట్టింది .

చిన్నపిల్లవాడా తనేమయినా!ముప్ఫయి రెండు నిండాయి, నవ్వుకున్నాడు.

త్వరగానే స్థిరపడిపోయాడు కొత్త వుద్యోగంలో.

ఆమెగురించి తెలుసుకోవాలని..ఎట్లా,ఎవరిని అడగాలో ..

మరొక రోజున కాంటీన్లో.అక్కడ అప్పటిదాకా మిలమిలలాడుతున్న విద్యార్థినులంతా తేలిపోయారు ఆమె లోపలికి రాగానే.ఏమి ధరించిందీ ఎట్లా అలంకరించుకుందీ అనే విషయమే పట్టినట్లు లేదు ఆమెకి,చూస్తూ వున్న ఇతనికి కూడా. ఆ ఉనికి ఒకప్రీ రాఫెలయిట్ చిత్రంలాగా వుంది. చూపులు  ఇక్కడయితే లేవు.

ఇంకొక  నాలుగు రోజులు  అలాగే  గడిచాక గమనిస్తున్న సహోద్యోగీ,కొత్త స్నేహితుడూ అయిన ఆనంద్ అడిగాడు-'పరిచయం చేయనా ' అని.చటుక్కున అనేశాడు ..'అంతకన్నానా'..

'ఇతను రాహుల్.కంప్యూటర్ సైన్స్ హెడ్ .కార్నీజి మెల్లాన్ లో చదివారు,ఢిల్లీ యూనివర్సిటీనుంచి వచ్చారు ' 'తను శ్వేత .ఈ పక్కనే రెసిడెన్ షియల్    కాలేజ్ వుందికదా..అక్కడ సంస్కృతం  చెప్తారు '.

ఆమె వైఖరి లో చిన్న గమనింపు .తనలోని దేనికో తెలియకపోయినా  అతనికి సంతోషం.

మెల్ల మెల్లగా పరిచయం పెరిగింది. ఇద్దరికీ సంగీతం ఇష్టం,కవిత్వం ఇష్టం. ' ఇద్దరికిద్దరూ ఏకాలంలోనో  ఆగిపోయారు ' వెక్కిరించేవాడు ఇద్దరికీ స్నేహితుడయిన  ఆనంద్.అయితే ఆ అభిరుచులలో వారి ప్రాధాన్యతలు వేరు వేరు.ఆమె అప్పుడే ఒక విషాద స్వప్నం లోనుంచి మేల్కొన్నట్లుండేది.అతను సౌందర్యాన్ని సమీపించి  హత్తుకునేవాడు. ఉత్తరాది లో పెరిగిన అతను భూప్  వింటూ  వుంటే
' ఇది మోహన  కదా ' అని పెదవి విరిచేది ఆమె.ఇంత ఉల్లాసం అవసరమా  అంటున్నట్లుండేది అతనికి.ఆమెకి పంతువరాళి ఇష్టం.అంత ఆర్తిని అతను తట్టుకోలేకపోతే స్వరవర్జితం చేసి హిందోళంలో ఆగేది ఆమె.' అమ్మయ్య, ‘మాల్ కౌన్స్ ' అనుకునేవాడు అతను.
ఆమె ' లేడీ  ఆఫ్ షాలట్ ' ని తడిసిపోయిన గొంతుతో చదువుతూ వుంటే భరించటం కష్టమయేది అతనికి..ఆమె కరుణించి 'టు ఎ స్కై లార్క్  ' చదివి ఓదార్చేది.
ఇదంతా కల్పించి ' శృతి  చేసిన   ఉన్మత్తత ' లో వాళ్లు ఒకరిని ఒకరు  ఆస్వాదించారు,దగ్గరయారు.
 *    *    *           *   *   *        *   *   *        *   *    *           *   *    *


ఆమె గాంభీర్యం తగ్గుతూ వస్తోంది అతని దగ్గర.ఒకసారి అడిగింది..'మీ పేరుకి అర్థం ఏమిటి? 'అతనికెక్కడ తెలుస్తుంది!సంస్కృతాంధ్రాలలో అతను సున్నా.

నేనే చెప్తాలెండి.' .దుఃఖాలని జయించినవాడని అర్థం.బాంధవుడని కూడా.. '

అతను వుడుకుమోతుతనం  తో..' మీ పేరుకి అసలు ఏమి అర్థముంది?తెల్లనిది  అంతే కదా! '

' నా పూర్తిపేరు మహాశ్వేత కదా '

' అయితే ఇంకా బుర్ర తక్కువ పేరులా వుంది.' బాగా తెల్లనిది ' అని ఎవరయినా పేరు పెట్టుకుంటారా? '

ఆమెకి విపరీతంగా  నవ్వు వచ్చింది.నవ్వి నవ్వి అన్నది’ శ్వేత అంటే స్వచ్చమైనదని కూడా అర్థం వుందండీ.
..' కాదంబరి 'కావ్యం లోది ఆ పేరు.' ఇంకేమీ అడగకుండా వెళ్లిపోయి వైకీపీడియా వెతికాడు.బాణభట్టు  అనే కవి రాసిన సంస్కృత కావ్యం అది.కాదంబరి,మహాశ్వేత అందులో నాయికలు.మహాశ్వేతది సుదీర్ఘ విరహం.ప్రేమించినవాడికి దూరమయి యేళ్లకి యేళ్లు గడిపిన స్త్రీ.ఆమె ఎదురుచూపు ఫలించి  చివరికి అతను తిరిగి వస్తాడు, మధ్యలో మరొక జన్మ యెత్తి,ముగించి.
 *   *    *            *      *    *         *  *   *                *  *   *
ఆ రోజు పొద్దుటినుంచీ పెద్ద వాన.ఆమె గొడుగు విప్పబోతూంటే అతను వద్దని ఆమె ఇంటిదాకా దిగబెట్టాడు .చుట్టూ తోట,గిలక బావి.కాలయంత్రంలో వెనక్కి వెళ్లినట్లుంది అతనికి.వాళ్ల నాన్నగారిని పరిచయం చేసింది.అలిసిపొయిన అగ్నిశిఖలాగా వున్నాడు ఆయన.పెద్ద హాల్ లో చుట్టూ పుస్తకాలు.ఒక మూలగా రాత బల్ల,కాయితాలూ,నోట్ పుస్తకాలు.' అంధ్ర మహా భారతానికి నిఘంటువు రాస్తున్నారు .ముఖ్యంగా తిక్కనగారు ఎన్ని పదాలు వాడారో అన్నిటినీ వాడుక తో సహా వివరించాలని '.

' శ్వేత చాలా సాయం చేస్తోంది. నేనుండగా  పూర్తి అవుతుందో లేదో 'దిగులుగా అన్నాడు ఆయన.

' లేదు లెండి..అయిపోతుంది '..అప్రయత్నంగా అన్నాడు రాహుల్.సంతోష పడ్డాడు  ఆయన.ఇల్లంతా చూపించింది.పాతకాలపు అమరిక,అలంకరణ.ఒక గదిలో పెద్ద చాయాచిత్రం, ఆమె తల్లిది .ఇంకో పదేళ్లకి శ్వేత  అలా వుంటుందేమో.
నువ్వు,మీరుల మధ్యలో ఆగుతూన్న  సంభాషణలో..
' అచ్చు మీ అమ్మగారి  పోలిక ‘

' అది అదృష్టం కాదు కదా '

' నమ్ముతారా అలాంటివి?'

' ఏమో.వెనక్కి చూసుకుంటే అలాగే  అనిపిస్తుంది '. .
*     *    *               *    *    *                             *     *     *

.విదేశంలో వున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు,తిరిగి వచ్చాక చేసేవాళ్లు  లేకుండాపోయారు.మాట్రిమొనీ వెబ్ సైట్ లలో తనని తను ప్రమోట్ చేసుకోవటం మొహమాటంగా అనిపించేది.
 *    *   *                            *  *  *                                     *  *  *
సంవత్సరం  గడిచిపోయింది అతను వచ్చి.ఇంకొక నాలుగు రోజుల తర్వాత ..

శీతాకాలపు అపరాహ్నం.జూకా మల్లె,మాలతి,కలిసిపొయి అల్లుకున్న పందిరికింద వాళ్లిద్దరూ .చుట్టూ చిన్న చిన్న పింగాణీ కుండీలలో చిట్టి రోజా పూలు.

పువ్వులు కోయాలని లేదు అంటూ అతను ఒక చిన్న కుండీని పైకి ఎత్తి ఆమెకి ఇస్తూ అనేశాడు..'నన్ను పెళ్లి చేసుకో శ్వేతా '.చేసుకుంటావా అని ఛాయిస్  ఇవ్వాలనిపించలేదు అతనికి.శ్వేత కళ్లలో ఆశ్చర్యం,ఆహ్లాదం..అవిమాయమయి ఎప్పటి  దిగులు . మళ్లీ ఆశ, కాంతి..!


పరీక్ష రాసి పాస్ అవుతానని తెలిసి ఫలితం కోసం ఎదురుచూసేవాడిలాగా గడిపాడు ఆ రాత్రిని..తీయటి .ఆలోచనలతో.

అతని ఊహ నిజం కాలేదు.ఏడ్చి  ఏడ్చి వాచిపోయిన కళ్లతో కనపడింది.

' ఎందుకు '?

' నువ్వంటే ఇష్టం,చాలా ఇష్టం.'

'మరి? '
నీకు ఎట్లా చెప్పాలో తెలియటం లేదు..నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నా..పన్నెండేళ్లుగా! ‘

‘అయితే?’

‘అతను రాడు '

ఆమె ఆ క్షణంలో ఎదిగీ ఎదగని అమ్మాయిలా కనిపించి అతనికి నవ్వొచ్చేసింది,కోపం పోయి.

ఆమెకి అర్థమయి రోషమొచ్చింది.' నీకేం తెలుసు?ఏం తెలుసని? ఆ?'మండిపోతున్నాయి మాటలు.

' లేదు లేదు..చెప్పు..వింటాను '

'నేను ఇంటర్మీడియట్ లో వున్నాను .ఇక్కడ ఈ కాలేజ్ మాత్రమే వుండేది అప్పుడు.

కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నారు యూనివర్సిటీ కోసం.ఆ పనులలో సూపర్ వైజర్ అ త ను .'

ఆ మూడు అక్షరాలూ పలకటానికి చాలా కష్టపడింది.

‘ అతనే పలకరించాడు..ఆ తర్వాత రోజూ మాట్లాడుకునే వాళ్లం.అతను చాలా బాగా పాడేవాడు తెలుసా!నేను రాసేదాన్ని అప్పుడు.రోజూ..రోజూ ఒక కవిత..అతని గురించి,అతని కోసం.నా రాత్రీ నా పగలూ నా ప్రతి నిమిషం అతని కోసం '

వింటున్నాడు.ఆమె గొంతు,ఆమె కన్నీళ్లు ఆ ముఖం..ప్రేమా దుఃఖమూ   కలిపి మలచిన ప్రతిమ లాగ ఆమె.


' అతను పాలిటెక్నిక్  చదివాడు.ఎన్ని ఊహించుకునేవాళ్లమో  ..కాస్త వెసులుబాటు రాగానే అతను ఇంకా చదువుకుంటాదు ,నా చదువు అయిపోయాక పెళ్లి.ఎప్పటికీ అతనితోనే వుండే కాలం కోసం ఎదురు చూస్తూ వున్నప్పుడు
నాన్నగారికి తెలిసింది.ఒప్పుకోలేదు.ఏవేవో అభ్యంతరాలు,అర్థం లేని వాదనలు.

అతను వెళ్లిపోదాం రమ్మన్నాడు.నేనూ సిద్ధపడిపోయాను.కాని.. ఏడుస్తోంది  ఆమె.' అమ్మకి అప్పుడే చాలా జబ్బు చేసింది.నేను ఒక్కదాన్నే వీళ్లకి.ఆ స్థితిలో వదిలేసి వెళ్లలేకపోయాను.

అతను ఆర్ధికంగా స్థిరపడాలని గల్ఫ్ వెళ్లాడు.ఉత్తరాలు రాసేవాడు నా స్నేహితురాలి అడ్రస్  కి.కాయిన్ బాక్స్ నుంచి వాళ్ల కంపెనీ ఆఫీస్ కి మాట్లాడేదాన్ని.ఒక యేడాది అయిపోయింది.
 
అతను పనిచేస్తున్న రిఫైనరీ లో అగ్నిప్రమాదం.అతను..ఇంక లేడు.'
చాలా మెలిపెట్టే నిమిషాల తర్వాత..
‘నాకూ చచ్చిపోవాలనిపించేది.అమ్మ కోసం ఆగిపోయాను.ఆ తర్వాత అమ్మ కూడా లేకుండా పోయింది.

ఎందుకో తెలియదు..అప్పటికి ఆత్మహత్య కోరిక తగ్గింది.ఏదో చదువుకున్నాను,వుద్యోగంలో చేరాను.నాన్నగారికి నన్ను పలకరించటానికే  భయం వేసేది.కొన్నాళ్లకి ఆయన మీద కోపమూ తగ్గింది.చాలా రోజుల తర్వాత ఆయన పెళ్లి ప్రస్తావన తెస్తే చాలా పొట్లాడాను,బెదిరించాను.వుండిపోయాను.పది సంవత్సరాలు నిఘంటువు పనిలో మునిగిపోయాను.

ఎవ్వరూ,ఇంక ఎవ్వరూ నన్ను కదిలించలేరు.అతని చోటులో ఎవరినీ వుంచలేను. '

కరుగుతున్న కాంచనం లాగా కాగిపోతోంది  ఆమె.ఆ తపస్సు కి అర్థం తపించటమే,ఇంకేమీ లేదు.

ఎప్పుడు చీకటి పడిందో గమనించలేదు వాళ్లు.దీపాలన్నీ వెలిగాయి.

అప్పుడు అంది ఆమె..' నీతో వుంటే నాకు చాలా బావుంటుంది.ఎంతో హాయిగా వుంటుంది.చాలా రోజులక్రితమే అర్థమయింది నాకు.

పెళ్లి చేసుకోమని కదా అడిగావు..చేసుకుంటాను.అతన్ని మర్చిపోవటం మాత్రం అడగద్దు. అలా అయితే నీతో వుండగలను! ‘

‘నువ్వు..నువ్వు అతని తర్వాతే!ఒక్క ఉదుటున ఆ మాటలు అనేసింది.


అతను గాయపడ్డాడు ,ఉక్రోషపడ్డాడు,ఖేదపడ్డాడు..అర్థ గంటలో అన్నిసార్లు చచ్చి బతికాడు.చివరికి తెలుసుకున్నాడు.

'నాకు ఇష్టమే శ్వేతా..నువ్వు   ఎలావున్నా నాకు కావలసిందే.అంతే.'

ఇంకే స్త్రీకి అయినా ప్రథముడిగా వుండటం కంటే ఈమెకి ద్వితీయుడుగా వుండటంఎక్కువ అనిపించింది అతనికి.కాదు,ఇందులో ఎక్కువ తక్కువల ప్రసక్తి  ఏమీ లేదు..ఆమె తనకి అంత అవసరం అంతే. అనుదినమూ ఆ గతించిన మనిషి  నీడతో జీవించగలడా..ఏమో..ఎవరు చెప్పగలరు..తన లాలనతో లాలస తో ఆమె పూర్తిగా తనది అవుతుందేమో!ఇంక కొన్నాళ్లకి ఒక పాప..ఇద్దరికీ సర్వస్వం అయిపోదా!జీవితం శుభంగా ,శోభగా గడవకూడదా!

*     *   *                                                      *    *   *                 *       *      *
ఆ తర్వాతి రోజులలో ఒకసారి అతని ఫోటో చూపించింది శ్వేత.అయిష్టంగానే చూశాడు రాహుల్.బాగున్నాడు,ఇరవై ఏళ్ల వయసులో ఉండే చురుకు ఉంది,నాజూకు లేదు.ఇంకా ఏమేమి లేవో ఎంచబోతూ ఉన్న మనసుని ఆపేశాడు , తనకేం సంబంధమని.కాని మరచిపోలేకపోయాడు ఆ ముఖాన్ని.

అంతా స్థిరపడింది ఇంచుమించు..పెళ్లి రోజూ తర్వాతి అందమయిన ప్రయాణం. అన్నింటి  తేదీలూ.శ్వేత ఉత్సాహంగా వుంది, అతను  ఆహ్లాద లోకాలలో వున్నాడు .
.ఆ ముందు  ఒక రోజున సిటీకి వెళ్లాడు అతను.కార్ సర్వీస్ కోసం.  ఒక రెండు గంటలు పడుతుందని సౌకర్యంగా కూర్చోబెట్టారు.అతను తీరికగా కలలు కంటున్నాడు.ఒక్కసారిగా పెద్ద కలకలం అక్కడ.భార్యాభర్తలేమో ,తన వయసు మనుషులిద్దరూ ,ధగ ధగమనే దుస్తులలో,నగలతో  బహుశా వాళ్ల పిల్లలూ. ఆ పిల్లలలో ఒకరిని ఎక్కడో చూసినట్లు అనిపించింది అతనికి.,గుర్తు రాలేదు.ఆ కొత్త మనిషి తిట్టేస్తున్నాడు అక్కడున్న అందరినీ.' ఎప్పుడనంగా ఇచ్చాను..ఇంకా కాలేదంటారేం ..పిచ్చి పిచ్చి గా వుందా ? ' స్పేర్ పార్ట్ లు రాకపోతే మేమేం చేస్తాం..' అన్నాడు ఒక వర్కర్ రోషంగా.ఆగంతకుడు ఒక్క దెబ్బ కొట్టాడు ఆ కుర్రాడిని.పెద్ద గొడవయిపోయింది.మానేజర్ వల్ల ఒక పట్టాన  కాలేదు సర్ది చెప్పటం.ఈ హడావిడి అంతట్లోనూ అతని భార్య టీవీ సీరియల్ చూస్తూనే వుంది.పిల్లలు ఈలోగా ఆ గదిలో వస్తువులని సగం నేల మీద పరిచి ఇంకో సగాన్ని చింపి పోగులు పెట్టారు.చిరాకేసి రాహుల్ బయటికి వచ్చి కూర్చున్నాడు.
. అతను  కూర్చున్న చోటికి వెనక దళసరి  చెక్కతొ అమర్చిన అడ్డుగోడ. లోపలినుంచి మాటలు వినిపిస్తూనే  ఉన్నాయి.తను ఉండే వూరు పేరు వినపడి కొంచెం ఆసక్తి వచ్చింది.ఆమె అంటోంది పెద్ద గొంతుతో '' ఎందుకు అక్కడికి పోతానంటావు?ఎవరున్నారక్కడ?''ఉట్టినే  వెళదాంలే....చిన్నప్పటి ఊరు కదా '' '' కాదులే,నాకు తెలీదా..ఆవిడని చూడాలనేగా?'' ''కాదు '' ''ఏమిటి కాదు?అసలు నీ మనసు ఆవిడ మీదే ఉందిలే..ఫోటో చూసా మరి..కళాకాంతీ లేదు,తెల్లగా పాలిపోయినట్లుంది  అదేమి అందమో '' ''మాట్లాడకు. .నీకేం తెలీదు ''చాలామంది లాగే ఆమె ఆవేశంలో గొంతు పెంచింది.ఎవరికయినా వినిపిస్తుందేమోనని లేకుండా,ఉన్నా లక్ష్యపెట్టకుండా . '' ఆ.ఎందుకు తెలీదూ,నీ బతుకంతా నాకు తేలుసు.నన్నెందుకు పెళ్లాడావోకూడా
  తెలుసు.మా నాన్న వీసా ఇప్పించకపోతే అక్కడ   రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవాళ్లు నిన్ను '' ''ఉష్..అరవకు.ఇప్పుడదంతా ఎందుకు?వెళ్లద్దులే,ఊరుకో ''
ఆ పిల్లవాడి ముఖంలో తెలిసిన పోలిక..వీళ్ల సంభాషణ..కలుపుతూ ఉంటే మెల్లగా అర్థమవుతోంది రాహుల్ కి.
 బయటికి వచ్చి వర్కర్ తో మాట్లాడుతుంటే పరిశీలించాడు ఆ మనిషిని.
.అతనే..,స్థూలకాయం ఎంత మార్చినా! .అతను చనిపోలేదు,ఏ కారణం చేతనో ఆ సంగతి శ్వేత కి చెప్పలేదు.డబ్బు సంపాదించినట్లున్నాడు ,పెళ్లి చేసుకుని పిల్లలని కన్నాడు.ఆమె మాత్రం అలాగే ఉండిపోయింది ఈ వ్యర్థుడి కోసం.


 ఒక్కసారిగా ఉపశాంతిగా అనిపించింది. ఇదంతా.శ్వేత కి చెప్పేస్తే సరిపోతుంది..ఎంత అదృష్టమో ఈరోజు ఇలా జరగటం.
.ఇక తనకి శతృశేషం వుండదు జీవితాంతం.ఆమె తన సొంతం-తనఒక్కడికే సొంతం!ఇన్నాళ్లూ ఈ మనిషి కోసం ఎంత తెలివి తక్కువగా క్షోభ పడిందో తెలిసివస్తేగాని..
.రాహుల్ ఆలోచన ఆగిపోయింది.ఆమె ఎంత అఘాతానికి గురి అవుతుంది!ఇన్ని సంవత్సరాల వ్యర్ధవేదన ఎంత బాధ పెడుతుంది…
ఏ ప్రేమ,ఏ తపసు,ఏ గర్వం తాను ఇన్నేళ్లూ తనవి అని నిలబడిందో అదంతా అసలేమీ కాదని,లేదని తెలిస్తే ఆమె సమతౌల్యం ఎంత మిగులుతుందో ..కోలుకోవటంలో ఎంతగా వడలి పోతుందో.. ముందే పగిలివున్న ఆమెని అతుకుపెడుతుందా ఈ సంగతి..ముక్కలు చేస్తే?
అలాంటి పరిస్థితిని తాను ఆమెకి ఎందుకు కోరుకోవాలి!
ఆమెని ఆమెగానే వుండనీ..ఎంత వుంటే అంతే చాలు అతనికి!
 ఎప్పుడయినా ఆ మనిషి  ఎదురు పడితే..?పడాలని ఏముంది,ఇంత విశాల ప్రపంచం లో!అప్పటికి ఆమె  తేరుకోదా ఏమిటి,తను ఉంటాడు కదా! 
ఆమె ఒక స్వప్నాన్ని ప్రేమించింది.మెలకువలో కలలు ఇంక రాబోతున్నాయి కాదా!
 ఆరుబయట చల్లటిగాలి. తేలిగ్గా హాయిగా అనిపించింది రాహుల్ కి. అతని మనసులోని నీడ తొలగిపోవటం వల్లనా ?
మెల్లగా సిటీ దాటి  వూరివైపు. మర్నాడు భోగి పండగ కాబోలు.వీధులన్నీ  రంగులు అద్దినట్లున్నాయి. . నారిజరంగు  సాయంకాలం.మనసు నిండా శ్వేతకాంతులు….