Friday 8 November 2013

కలల ఇంటి చిరునామా

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి, మోయలేని ఈ హాయిని మోయనీ, ఒక్క క్షణం ” అంటే అర్థమయినట్లే ఉండేది.


కృష్ణశాస్త్రి గారు విడిగా  కవిగా పరిచయమయేనాటికి పదమూడేళ్లు నిండాయి నాకు. ” కృష్ణపక్షమ్మొకటె నాకు మిగిలె ” …ఈ వాక్యాలు నా లోపలి దేనికో ఆకృతినిచ్చినట్లు అనిపించింది , ప్రాణస్నేహితురాలిని వదిలి ఉండటం అనే తీవ్రమైన దుఃఖం లో ఉన్నప్పుడు .అది  ఇప్పుడు తలచుకున్నా అవమానంగా ఏమీ అనిపించదు. ఆత్మీయులకి దూరం కావటం కంటె శోకమన్నది లేదని ఈ నాటికీ తోస్తుంది, విధి అనుమతించినన్నాళ్లూ  అహర్నిశలూ చూస్తూ ఉండగలగటం కన్న కోరుకోవలసిన ఆనందమేమీ  లేదు, ఎప్పటికీ.
ఈ మధ్య బుజ్జాయి  గారు రాసిన ‘ నాన్న-నేను ‘ చదివాక కృష్ణశాస్త్రి గారి దృక్పథం తెలిసింది.
” నావలె అతడున్మత్త భావమయశాలి, ఆగికోలేడు రేగు ఊహలనొకింత ! ఇంత చిరు గీతి ఎద వేగిరించునేని పాడుకొనును, తాండవనృత్యమాడుకొనును ”  ఈ మాటలు ఇంచుమించు మూడు దశాబ్దాలు నా జీవితపు టాగ్ లైన్ లు గా ఉండేవి. ఆ రెపరెపలాడిపోయేతనమే నడుపుతూ ఉండేది నన్ను, అలా గాలికి కొట్టుకుపోతూనే  ఉండేదాన్ని.నేల మీద నిలిపేందుకూ  వేరే రచయితలు  ప్రయత్నిస్తూ  ఉండేవారు, కాని  కాలు నిలిస్తేనా !
శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు  ఉంటారా ?   దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.
పదిహేడేళ్లు వచ్చేనాటికి అమృతవీణ, మంగళ కాహళి, వ్యాసాల సంపుటులు నాలుగూ విడుదలయాయి. ఆ వచనం ఎంత మార్దవంగా,  రుచిరార్థ  సమ్మితంగా ఉండేదని ! శ్రీశ్రీ గారు రాసిన వ్యాఖ్యానంతో వచ్చాయి అవి. ” ఇక్షుసముద్రం ఎక్కడుందో చూశారా  ” అని మొదలవుతుంది అది. ఆస్వాదానికి ఆహ్వానంతోబాటు చిన్న అవమానమూ ఉంది అక్కడ ” ఇంకా మీరు కోరుకునే ఎన్నో మసాలాలున్నాయి ” అనే మాటల వెనక. అది శ్రీ  శ్రీ ఉద్దేశించారో లేదో నాకు తెలియదు. కృష్ణశాస్త్రి గారి కవిత్వపు, సామీప్యపు ఇంద్రజాలానికి బలంగా లోనయి బయటపడినవారిలో శ్రీ శ్రీ ఒకరని అప్పటికి తెలియదు.
కవితాప్రశస్తి  వ్యాసాలలో ‘ కరుణ ‘ అనేది చాలా కాలం ఊపివేసేది. దుఃఖించేవాడి  గురించి ” అతను తెలిసిపోతాడు , అతని దగ్గర చెప్పులు వదలి తల దించుకుంటాము ” అంటారు. అంతకన్న చెప్పవలసినది లేదు.లిరిక్  శిల్పం అనే వ్యాసమూ నాకు చాలా ఇష్టం. మంత్రపుగవాక్షాల  గురించీ, ప్రమాదభరిత సాగరాల గురించీ కీట్స్ కవితా పంక్తుల  పరిచయం అక్కడే .
కవి పరంపర అనే వ్యాసాల వరసలో ” నా కంటికి తిక్కన్న గారు పొడుగ్గా ఉంటా డు ‘ లాంటి వాక్యాలతో పదచిత్రాలతో ఆయా కవుల రూపురేఖా విలాసాలని బొమ్మ కట్టిచూపటం విపరీతంగా ఆకర్షించేది . మృత్యువు కన్నా నల్లని అన్యాయాలను సహించటం  ” అని మొదలయే గీతం గా నన్ను పరిపాలించింది అప్పటిలో.
 మహావ్యక్తులు సంపుటం లో చిత్త రంజన్   దాస్ గారి గురించిన వ్యాసం బలంగా  ఉంటుంది.ఆయన రచన కి  బహుశా కృష్ణశాస్త్రి గారే చేసిన అనువాదం ” ఆశకు కూడా అతీతమయిన కష్టాలు  పడటం, రాతిరి కన్నా
మన నాయనమ్మ కంటే కొన్నిసార్లు మనకి గాంధారి ఎంత బాగా తెలుస్తుందో చెబుతారు ఇంకొక చోట, ఇతిహాసాల గురించిన  ప్రస్తావనలో.
పొద్దున్నే లేవలేని నా బద్ధకానికీ పద్యం ఎప్పటికీ సమర్థింపు
” తల్లిరేయి, ఆమె చల్లని యొడిపైని నిదురపొమ్ము
నిదుర నిదుర కొక్క కల వెలుంగు పసిడి జలతారు  అంచురా
మేలుకొనకు కల వేళ, తండ్రి ! ”
అమృతవీణ దినదినాహారం అప్పుడు. గుంటూరు లో అరుదుగా దొరికే సిం హాచలం  సంపంగి పూరేక్కలు దాచుకున్నాను ఆ పుటలలో, ఉన్నాయి ఇంకా. ప్రేమ లోని, అర్పణ లోని ఎన్ని మన స్స్థితులను  చెప్పారో ఆయన అందులో. ” చిన్ని పూవు పదములపై ఒకటే, కన్నీటి చుక్కలాపై రెండే ” అనే ఏకాంత దర్శనం ఒకసారి, ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని  ఎలాగ  పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.
ఆ రోజులలోనే మొదటిసారి మల్లీశ్వరి  చూడగలిగాను. ఏమో, అందరూ ఏమేమి అంటారో నాకు తెలియదు, అది కృష్ణశాస్త్రి గారి కృతి నాకు, అంతే… కనీసం ప్రధానంగా.నల్ల కనుల నాగస్వరం మోగుతూనే ఉంది…. వెండివెన్నెల గొలుసులకు వ్రేలాడిన రేయి ఊయల ఊగుతూనే ఉంది….
స్వాప్నికలోకానికి ఈవల ఎన్నో జరిగితీరుతాయి తప్పదు, నాకూనూ. ఆ   గాటంపుకౌగిలి వదలి కనులు వేరేలా తెరచిచూడవలసిందే. నా లోపలి నన్ను పదిలపరచుకుంది వారివలన. వారే చెప్పిన మాటలు … అవకాశం దొరుకుతూనే పిల్లలని వినమనే మాటలు, జీవనసంరంభం  నడిమధ్యని నిలవలేవు,  దూరమయి నిభాయించుకోలేవు , అందుకే
” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో ! ”

                               [సారంగ లో వచ్చిన వ్యాసం ] 


Tuesday 5 November 2013

పున్నాగ

కార్తీకమాసమూ పున్నాగపూలూ కలిసి ఇంటికొస్తాయి ప్రతి ఏడూ. ఈ పూలతో ఎన్ని పెనవేతలు ఉన్నాయో ! గుంటూరు నుంచి రేపల్లె వెళ్లే దారిలో పిట్టలవానిపాలెం అనే అందమయిన ఊరు ఉంది, వెలిగిపోయే ఆకుపచ్చ రంగులలో వేసిన బొమ్మ. ఒక నవంబర్ లో కొన్ని రోజులు అక్కడ గడిచాయి,
 కాలదేశపు రాకుమార్తె గుప్పెడు శాంతిని పిడికెడు  చలితో తో కలిపి అద్దుకునే ఋతువు అది. ఎంత కాగే మనసు అయినా కాస్త శమించి ఆగే సమయం
  .కొన్ని పూలు పొద్దున్నే విచ్చుతాయి, కొన్ని రాత్రికి. ఇవి ' పొద్దెక్కి ' విరిసే పూలు. వీటి వైభవం అప్పుడు మొదలయి రాత్రి సగం గడిచేదాకా. మధ్యాహ్నపు కునుకు తీసే కాలువ మీదికి నవ్వే పూవులు. గోరు వెచ్చని చిట్టి ఎండని ముద్దు చేస్తూ రాలే పూవులు. వెన్నెట్లో రాత్రి వేళ చుక్కల్లా ఊగే పూవులు.
    అప్పుడుండే ఇంటి ముంగిట నాటుకున్నామొక  మొక్కని, అమరావతి గుడి తోట లో అడిగి తెచ్చుకున్నాము..,ఎదిగి వృక్షమై ఏటేటా ఉత్సవాలు చేస్తుంటే చూసుకున్నాము, తప్పనిసరయి వదలి వచ్చాము.
 కొన్ని యేళ్ల వియోగం అంతమై ఇంకో రెండు మొక్కలు పెంచాము. చుట్టూ దడి కట్టాము, కాపాడాము, గోదావరి మట్టిసారం సాంద్ర సురభిళ పరిమళమైంది.
    రెండు చెట్లూ రెండు పూల మేడలు గాలిలో. ఒకతుఫాను  ఉదుటుకి ఒకటి కూలిపోయింది. ఏడ్చి ఊరుకోవటం కాదు, మోకులు కట్టి లేపాము. ఆశ వృధా అయిపోలేదు, ఆరుబయటి ఆలయం లో పూజ ఆగి పోలేదు.

[కర్టసీ..స్వాప్నిక్ చీమలమర్రి ]

ఒక రచన ని ఇష్టపడటం కనీసం నాలుగు స్థాయిలలో ఉంటుంది... 1.బాగుంది 2.నచ్చింది 3.నా లోపలికి వెళ్లింది 4.నా ఆలోచన లోనూ జీవనవిధానం లోనూ ప్రతిఫలిస్తోంది.

ఇ.గాయత్రి

ఇ.గాయత్రి గారు సరదాగా సినిమా పాటలు వీణ మీద పలికిస్తారు.ఆ సరదా గొప్ప వరం ఓల్డీస్ ప్రియులకి.' మనసు పరిమళించెనే ' అనే ఆల్బం లో మనం ఇష్టంగా వినే తీయటి పాత పాటలు ఉన్నాయి.మొదటి పాట ' విన్నానులె ప్రియా '.ఒకరి మనసు ఒకరు ' ' కనుగొన్నప్పటి ' పట్టలేనంత ఆనందం ఉత్సవంలా వినిపిస్తుంది నాకు ఈ పాటలో. దీనికి తెలుగులో సంగీతం పెండ్యాల గారయినా మూలం ఎం.ఎస్.విశ్వనాథన్ గారిది.కొన్ని మార్పులు చేశారు పెండ్యాల గారు.ఒరిజినల్ కూడా వేరేగా ఎం.ఎస్. వి మెలొడీస్ అని వాయించారు గాయత్రి గారు.ఈ తెలుగు పాటల ఆల్బం లో ఉన్నవన్నీ ముత్యాలూ పగడాలూ.' తపము ఫలించిన శుభవేళా ','నిన్న కనిపించింది ' ,'ఖుషీ ఖుషీగా నవ్వుతూ ','మనసు పరిమళించెనే ',' ప్రేమయాత్రలకు '.గాయత్రి గారి వీణ గొంతుతో పాడినట్లే ఉండటం చిత్రం.'ఒంటరొంటరిగ పోయేదానా ' పాటలో 'ఓ..నానా ' అనటంలో నాజూకు ఎంత శ్రావ్యంగా ఉంటుందో. 'నిలువుమా నీలవేణీ ' వాయించిన తీరు అద్భుతం.నాకు సినిమాలో దాని కంటే ఇదే బావుంటుంది.ఆ లింక్ విడిగా ఇస్తున్నాను.అక్కడ కన్నక్కుడి గారి  ఇంకొన్ని మెలొడీ లు బోనస్ గా ఉన్నాయి.' చిన్నారి పొన్నారి పూవు ' మృదువు గా వినిపిస్తుంది వయొలిన్ మీద.గాయత్రి గారుమీటినవి   ఇంకా ఉన్నాయి ఇందులో.. 'పాడవేల రాధికా ',' ఓహో మేఘమాలా ','చేయి చేయి కలుపరావె '...అన్నీ తప్పకుండా వినండి తీరిక చేసుకుని. http://m.bindassfm.com/album.php?id=igk http://gaana.com/song/old-is-gold-manasu-parimalinchane-ntr-and-anr-film-tunes/niluvuma-niluvuma-amarasilpi-jakkanna-76434E Gayathri Manasu Parimalinchene E Gayatri Hits Telugu Songs m.bindassfm.comFree Manasu Parimalinchene E Gayatri Hits Music, Albums, E Gayathri

fragrance

సువాసన పిలుపు వంటిది,పదిమందినాకర్షిస్తుంది. సౌరభం పక్షి వంటిది,దిక్కుదిక్కులా గాలిమీద పరుగెత్తుతుంది సుగంధం స్మృతి వంటిది,పదే పదే స్ఫురిస్తుంది పరిమళం పట్టుకుని విడవని బలవంతపు బంధువు కాదు,తరిచూచి దరియవచ్చే నేస్తం. ఆమోదానికి స్వార్థం లేదు,కలిసిగట్టుదనం ఎక్కువ-అందరికీ అనుభవం పంచి పెడుతుంది. -దేవులపల్లి కృష్ణ శాస్త్రి

కాదంబరి

' మహాశ్వేతల్లే ఉన్నావే మా తల్లీ ' అని మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కృష్ణాతీరంలో చదివి ఎవరీవిడ? అనుకున్నాను.ఏ పుస్తకంలో ఉందో మాత్రమే తెలిసింది.[ఇన్ని యేళ్లూ నన్ను వెంటాడుతూనే ఉంది కథ రాసేవరకూ ] సంస్కృతం రాదు,ఇంగ్లీష్ అనువాదాలు అందుబాటులో లేవు. వేరే తెలుగు కావ్యాలు చదువుకోవాలంటే పద్యాన్ని అర్థం చేసుకోవటం తెలియదు. నా చదువుకునే చదువులో భాష ఒక భాగం కాదు. ఆశ మాత్రం ఉండేది. ఆ 80 ల లో నాకు ఎవరు చెప్పారు? రెంటాల గోపాలకృష్ణ గారి కరుణ ప్రసరించింది తేలికయిన,సమగ్రమయిన తెలుగు వచనం ద్వారా. ఆ పుస్తకాలలో కొన్ని ఇప్పుడు కినిగె లో దొరుకుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది.http://kinige.com/kbook.php?id=1867&name=kadambari

పుణ్యనదులు

అడివి బాపిరాజు గారి ' తుఫాను ' నుంచి '' ఒక్కొక్క నది ఒక్కొక్క రీతిగా మనుష్యులను నడుపుతుంది.కృష్ణానది శిల్పుల నది.గోదావరి కవుల నది అన్నారు. పెన్నా తుంగభద్రలు విక్రమజీవనమిస్తాయట.కావేరి గాంధర్వానకు అమృత జీరలు వరమిస్తుందట. గంగానది తపస్వినియట. యమున భక్తిమాల .'' నర్మద గురించి బాపిరాజుగారు చెప్పలేదు...బహుశా నర్మద జ్ఞానుల నది ఏమో.

రమ్యమైన అపహరణ

పదోతరగతి లో మాకు పాఠ్యాంశంగా ఉండేది ఈ ఘట్టం.విని ఆ జగన్మోహనుడి మీద మనసు పారేసుకున్నాను . బహుశా అప్పుడే శ్రీకృష్ణపాండవీయం సినిమా చూశాను. అందులోని అతిరమణీయమైన చిత్రీకరణ తెలుగు వారికి పట్టిన అదృష్టాలలో ఒకటి. రుక్మిణి ముగ్ధత్వం,సమర్పణ...శ్రీకృష్ణుడి   మధురౌద్ధత్యం   , స్వీకరణ..ప్రాణం పోసుకున్న దివ్యప్రణయం...ఒకేసారి ఒకరు ప్రేమికుడూ భగవంతుడూ కూడా అవటం ఇదిగో, ఇలా ఉంటుంది. చదవండి ఒక్కసారి, చూడండి ఆ పద్యం వరకూ అయినా ' పోతన్న కైతలన్ని పోత పోసుకున్నవాడిని '!


కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం,గంఠీరవేంద్రావల గ్ను,నవాంభోజదళాక్షు, జారుతరవక్షున్,మేఘసంకాశ దే హు,నగారాతి గజేంద్రహస్త నిభబాహుం, జక్రి బీతాంబరున్ ఘనభూషాన్వితు, కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్! (దశమస్కన్దము,పూ.భా. 1752-రుక్మిణీ కళ్యాణ ఘట్టం)
తనను రాక్షస వివాహము చేసుకొనడానికి వచ్చిన శ్రీకృష్ణుని రుక్మిణీదేవి కనుగొన్నప్పటి ఆయన రూపాన్ని పోతన గారు పైవిధం గా ఆమెకు చూపారు . చంద్రమండలము వంటి చల్లని కాంతిప్రసరించే ముఖము గలవానిని, సింహము వంటి నడుము కలవానిని,అప్పుడే వికసించిన తామరల వంటి కన్నులు గలవానిని, గొప్ప ఉరము కలవానిని, నీలమేఘమువంటి శరీరము గలవానిని, దేవేంద్రుని ఏనుగు ఐరావతపు తొండమువంటి బలిష్టమైన బాహువులు గలవానిని,చక్రాయుధముపట్టి న వానిని,పసుపువన్నె పట్టుధోవతి ధరించినవానిని,  గొప్ప ఆభరణములు ధరించినవానిని, అందమైన శంఖము వంటి మెడ గలవానిని, విదర్భ రాజ్యపు సేనలను వోడించి తనను గొనిపోవ వచ్చిన జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని రుక్మిణీ దేవి కనుగొన్నది.http://www.youtube.com/watch?v=kyC8wpxUhYo

నేపథ్యం

బంగారు మురుగు ఎన్నిసార్లు చదివానో...నిజమయిన ఫీల్ గుడ్ కథ..ధనలక్ష్మి దీని తర్వాత నాకు ఇష్టమయిన కథ.' ధనలక్ష్మి ' కథా నేపథ్యం లో ఉందని తెలుసు.నేపథ్యం తెలుసుకోవటం ఇంద్రజాలాన్ని పోగొట్టుకోవటం లాగా ఉంటుంది నాకు.సామాన్య గారి 'పుష్పవర్ణమాసం ' చాలా మోహపెట్టింది నన్ను.సౌరిస్ గారి 'ఉష ' తర్వాత నేను తెలుగులో ఆస్వాదించిన ఇంద్రియాతీత కథ అది. ఆ కథలోని మామిడి చెట్టుకి ప్రేరణ వారి ఇంటి వెనక ఉండే పనస చెట్టు [ఆమె బ్లాగ్ లో చెప్పారు..అది అందరికీ ఓపెన్ అయే రోజులలో ]అని చదవగానే దభీమని నేల మీద పడ్డాను.ప్రయత్నం చేసి ఆ సమాచారాన్ని మరచిపోయి మళ్లీ చదువుకున్నాను.ఈ భావన నా వ్యక్తిగతం.

రాజ్యాధికారం

తెలుగు పద్యాలని చదివి అర్థం చేసుకోవటం అంతగా తెలియదు నాకు.బేతవోలు రామబ్రహ్మం గారు ప్రసిద్ధ పద్యాలని పరిచయం చేసి వ్యాఖ్యానించిన పుస్తకం దొరికితే తెచ్చుకున్నాను.అందులో ఒక కొత్త సంగతి తెలిసింది. సంస్కృత భారతంలో అంధుడయిన ధృతరాష్టృడికి రాజ్యార్హత లేదని పాండురాజుకి రాజ్యాభిషేకం చేసినట్లు ఉందనీ,నన్నయభట్టారకుల ఆంధ్రమహాభారతంలో జ్యేష్టుడయిన ధృతరాష్టృడిని రాజుగా అభిషేకించి ఆయన తరపున పాండురాజు రాజ్యం చెశాడని ఉందనీ. ఈ విషయాన్ని ఈ మధ్య విజయవాడ లలితా త్రిపుర సుందరీ పీఠం వారు ప్రచురించిన వ్యాసభారత వచనానువాదంలో చూసి రూఢి చేసుకున్నాను. సంస్కృత భారతం ప్రకారం కౌరవులది పూర్తి అధర్మం.తెలుగు భారతం ప్రకారం వారికే హక్కు ఉంటుందేమో.ధర్మరాజు జ్యేష్టుడు అనే వాదన తప్ప పాండవుల వైపు న్యాయం లేనట్లు కనిపిస్తుంది.పాండురాజు ఎన్ని దిగ్విజయాలు చేసినా అవి రాజప్రతినిధిగా చేసినవి మాత్రమే అవుతాయి.ఈ మార్పు నన్నయ్య గారు ఎందుకు చేసినట్లు?

తెలుగూ సంస్కృతమూ

ఇంగ్లీష్ తో పాటు తెలుగు ఇంటర్మీడియట్ అయిపోయేవరకు తప్పనిసరి చేయాలి.సంస్కృతాన్ని ప్రవేశపెట్టటం,అందులో నూటికి తొంభయి ఎనిమిది మార్కులు వేయటం ఇంక చాలు.అందువల్ల విద్యార్థులకి వంటబట్టినదేమీ లేదు.చాలా కంటితుడుపు గా ఉంటోంది ఆ భాషా బోధన.ఆ భాషలో ప్రాథమిక జ్ఞానం లేని పిల్లలు అక్కడ చేస్తూ ఉన్నదేమిటో అందరికీ తెలుసు.తెలుగు లోనూ అన్ని మార్కులూ వేయమనండి చాలు.ఏ రెసిడెన్షియల్ కాలేజ్ లోనూ తెలుగు విభాగమే ఉండటం లేదు.ఈ మాటలు సంస్కృతం మీద గౌరవం లేక అంటూ ఉన్నవి కావు. అమ్మకి విలువ  లేని చోట అమ్మమ్మ సంతోషిస్తుందా?

ద్రౌపది నవ్వు?

ఎవరయినా జారిపడితే చూసేవారు ఎందుకు నవ్వుతారు?అది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య [reflex ] వంటిది.పడినవారు రోగగ్రస్తులూ,వృద్ధులూ కానప్పుడూ,ఆ పడిన పద్ధతి ఎక్కువ హాని కలిగించేదిగా తోచనప్పుడూ అలా నవ్వు రావటానికి ఏ ఆటంకమూ ఉండదు.ఒక్క లిప్త లో ఇన్ని భావనలు ఒక ప్రేరణ ని ప్రభావితం చేస్తాయా అనే సందేహం అవసరం లేదు.ఇలాంటివాటిని 'కండిషండ్ రిఫ్లెక్స్ 'లు అంటారు.ఆ పడిన వారి ప్రవర్తన గతంలో తమపట్ల సరిగాలేనప్పుడు నవ్వును ఆపుకోవాలనీ అనిపించదు. వాకిలి పత్రికలో వచ్చిన సామాన్య గారి కథలో ఒక 'పక్షి ' కథ చెప్తున్నవారిని చూసి ద్రౌపది కామవాంఛ తో దుర్యోధనుడిని చూసి మోహంతో నవ్వినట్లు నవ్విందని రాశారు. తన భావాన్ని అర్థం చేసుకోలేని దుర్యోధనుడి మూర్ఖత్వానికి ద్రౌపది శపించుకుని వుంటుందని కూడా తీర్మానించారు.ఆ కథ లోని 7,8 పేరాగ్రాఫ్ లని చూడండి. ఏ' పక్షి ' ఎవరిని చూసి ఎలాగయినా నవ్వవచ్చ్హును.ద్రౌపది ప్రసక్తిని తీసుకురావటానికి ఆధారం ఎక్కడనుంచి వచ్చింది? వ్యాసభారతం అనువాదం..సభాపర్వం..''నీళ్లల్లో  పడిన సుయోధనుని చూసి భీమసేనుడు నవ్వాడు.అతని పరిచారకులూ నవ్వారు.రాజుగారి ఆజ్ఞ ప్రకారం అతనికి పొడిబట్టలు ఇచ్చారు .ఆ స్థితిలో ఉన్న అతనిని చూచి భీమార్జున నకుల సహదేవులు కూడా బాగా నవ్వారు. '' నన్నయ్య గారి మహాభారతం సభా పర్వం ద్వితీయాశ్వాసం...''.....స్ఫటిక దీప్తిజాల పరివృతంబయినజలాశయంబు   స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి,క్రమ్మరిన వానిన్ జూచి పాంచాలియు,పాండుకుమారులును నగిరంత. నన్నయ్య గారు మూలంలో లేని కల్పనని చేసి ద్రౌపది పాత్ర ఔచిత్యాన్ని తగ్గించారనిపించినా,ఆమె భర్తలతో కలిసి నవ్విందనే ఇందులో ఉంది. సామాన్య గారి కల్పన చాలా బాధాకరం గా ఉంది.

sanjivadev

తాను నిర్ణయించుకున్న భౌతికమయిన పరిధిలో జీవిస్తూనే అందుకోగల సౌందర్యసర్వస్వాన్నంతా తనలోనూ చుట్టూనూ నిలుపుకోవటం సాధ్యమేనని సంజీవదేవ్ గారి వలన తెలుసుకోగలిగాను.భావుకుడూ కళాకారుడూ అయినంత మాత్రాన పర్వర్ట్ కానక్కర్లేదని కూడా. ఆయన ' తుమ్మపూడి ' నుంచి కొన్ని వాక్యాలు ..ఆయన హిమాలయాలలో రోరిక్ ల ఇంట గడిపినప్పటి రోజులలోవి. ' వెన్నెల తెల్లగా ప్రకాశించసాగింది.కిటికీలో గుండా ఈస్టర్ లిల్లీ ల మీద వెన్నెల పడి వెన్నెల కంటె తెల్లగా వెలుగుతున్నాయి అవి.వాటి సుగంధమాధురి కూడా ప్రసరిస్తోంది బాగా.మళ్లీ వెళ్లి కిటికీలో కూర్చున్నాను నేను.సంపూర్ణమైన ఆనంద వాతావరణం.తెల్లని వెన్నెల,మధుర సుగంధం ,ఈ రెండూ మిళితమై అద్వైత రూపం దాల్చినాయి.ఆకాశంలోని చంద్రుని నుంచి ఈ సుగంధం వస్తున్నట్టు,క్రింద ఈస్టర్ లిల్లీ ల నుంచి ఈ వెన్నెల ప్రసరిస్తూన్నట్టు తట్టసాగింది.వెన్నెలకు సువాసన ఉన్నదని,సువాసనలో వెన్నెల ఉన్నదని భావిస్తూ మంచం మీద పడుకొని కళ్లు మూశాను .'

మల్లినాథసూరి

మల్లినాథ సూరి గొప్ప వ్యాఖ్యాత,వైయాకరణి.ఈయన తెలుగు వాడని చెప్తారు.సంస్కృతం లో పంచకావ్యాలు అన్నిటికీ ఈయన రచించిన వ్యాఖ్యలు ప్రామాణికమైనవి.ఈయన ఇంటిపేరు కొలిచెల అనీ,13,14 వ శతాబ్దాల ప్రాంతం వాడనీ అంటారు.ఒక కథ ఉంది ఈయన గురించి. విద్వత్ కుటుంబం లో జన్మించాడు ,వివాహం కూడా అయింది.అయితే ఇంచుమించు నిరక్షర కుక్షిగా ఉండేవాడట .భార్య మంచి విద్వాంసురాలట.ముందే తెలియదో ఏమో,చాలా ఉక్రోషం వచ్చిందట ఆవిడకి.చూసి చూసి అన్నదట.. ''రూప యౌవన సంపన్నం కులశీల గుణ సంపదా విద్యాహీనం నశోభంతే ఫాలాశ కుసుమం వృధా '' [అందమూ,యవ్వనమూ,మంచి వంశంలో జన్మించటం,సత్ప్రవర్తన,ధనమూ ఎన్ని ఉన్నా విద్యలేని వాడు ప్రకాశించడు.మోదుగ పూవు వలె వ్యర్థుడు ] ఆయనకు ఆ మాత్రం సంస్కృతం వచ్చునో,లేదా అర్థమే చెప్పించుకున్నాడో..భావం తెలిసిపోయింది.రోషం వచ్చేసింది,ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బహుశా కాశీకి. ఒక శాస్త్రం లో పండితుడవటానికి పన్నెండేళ్లు పట్టేది.కుశాగ్ర బుద్ధి కనుక ఆ వ్యవధిలో ఎన్నో శాస్త్రాలలో నిధి కాగలిగాడు. అప్పటికి ఇంటిమీద ధ్యాస తిరిగింది.తిరిగి వచ్చాడు. ఇక్కడ భార్య దీనమయిన స్థితిలో ఉంది.భర్తృవియోగ దుఃఖానికి తోడు తానే అతను అలా వెళ్లిపోవటానికి కారణం అని తెలిసిన పెద్దవాళ్ల సాధింపులు.ఈయన ఇల్లు చెరేసరికి చీకటి పడింది.ఆమె గడ్డమూ మీసాలూ ,పన్నెండేళ్ల వయస్సూ పెరిగి ఉన్న భర్తని గుర్తు పట్టలేదు.ఎవరో అభ్యాగతి అనుకుంది.ఆయన భోజనం కోసం అప్పటికప్పుడు వంట చేసింది.వడ్డిస్తూ ఉంది.చారు పోసింది.ఆమె మనసు వికలంగా ఉండటం చేత ఉప్పు వేయట మరచిపోయింది.ఆయన అందుకున్నాడు. '' చారు చారు సమాయుక్తం హింగు జీర సమన్వితం లవణ హీనం నశోభంతే ఫాలాశ కుసుమం వృధా ''[ఎంత శ్రద్ధతో ఇంగువ,జీలకర్ర వేసి కాచినా,ఉప్పు లేని చారు రుచిగా ఉండదు,మోదుగ పూవు వలె వృధా ] ఆమెకి ఒక్కసారిగా అర్థమయిపోయింది.పాదాల మీద పడి మన్నించమంది.అతను ఊరడించాడు,లేకపోతే నేను చదువుకునేవాడినా అన్నాడు .కథ సుఖాంతం. [సంస్కృతం చదువుకోలేదు,నా జ్ఞాపకం లోనుంచి రాస్తున్నాను.తప్పులు ఉంటే చెప్పగలరు]

కొండగాలి తిరిగింది

అవును మలయమారుతం.ఒక్క గాలి విసురుకి ఆ కొండవాలులోకి విసిరివేయబడతాము..ఈ పాట ని దృశ్యంగా చాలా ఏళ్లు చూడనేలేదు,అసలు ఆ వెలితే తట్టలేదు .మధ్యలో వచ్చే ఆలాపనకి సుఖంగా రెపపలాడుతుంది గుండె.ఇంటర్ లూడ్ లు ఏటిలో కెరటాలు..కదలికలో ఇంత స్థిమితం ఉంటుందా...అవును,ఇది ఉయ్యాల కదా మరి.సాహిత్యం...అన్ని పదాలు,ప్రయోగాలు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి నాకు.పదచిత్రాలు,అవి కల్పించే ఇమేజరీఇంద్రజాలం.మొగలిపూల వాసనతో మురిసిపోవటం ఏమిటో ఎంత తలచుకున్నా పూర్తిగా తెలిసిపోదు.[ఆ తర్వాత విరివిగా వాడుకున్న సిరివెన్నెల అనే మాట ఆరుద్ర గారు మల్లాది వారి శిష్యులని పట్టి ఇస్తుంది.]

కౌమారపు పూలతోట

ఈ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది ..రహస్యాలు గుసగుసగా వినపడుతూ వుంటాయి..
నీ అడుగు ఎక్కడ పడుతోందో గమనించుకుంటావు కదూ
‘ నా పన్నెండేళ్ల మేనగోడలికి బహుమతి ఇస్తూన్న ‘ ద సీక్రెట్ గార్డెన్ ‘ పుస్తకం మొదటి పుట లో ఈ మాటలు రాశాను.ఈ నవల శీర్షికని దాని అంతర్ధ్వని కోసం ఇష్టపడతాను..
లోపలి తలుపులూ బయటి తలుపులూ తెరుచుకుంటూ కనిపింపచేసే అందమయిన ఆరామంగా ఆ వయసు వుండాలి.అది ఆదర్శమవనీ,స్వప్నమే అవనీ..అక్కడ కొన్నాళ్లు నిలవాలి.
ఈ అమ్మాయి తెలుగు బాగా చదువుతుంది. చందమామ వాళ్లు గొప్ప దయతో ఏర్పరచిన పాత సంచికల భాండాగారాలన్నీ చదివేసుకుంది.ఎనిడ్ బ్లైటన్  పుస్తకాలన్ని అయ్యే పోయాయి. ఇప్పుడు తను తెలుగులో చదవదగిన  కథా సంకలనాలు కొన్ని వున్నా నవలలు ఎన్నో లేవు. మార్క్ ట్వేన్ ని తెలుగులోకి తెచ్చి అంతతో ఆగిపోయారు నండూరి రామమోహనరావు గారు. ముళ్లపూడి వారు భూప్రదక్షిణం ఒక్కటే అనువదించారు. టాం సాయర్ ని తెలుగు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు, ఆవరసలో రావలసిన ఇతర సాహిత్యమేదీ తెలుగులోకి రాలేదు.
బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం బాగా నచ్చి తర్వాతి కథ చదవబోయిన పిల్లలకి ఆశాభంగమవటం నేను చూశాను. శ్రీ  పాద వారి వడ్లగింజలూ,మార్గదర్శీ కౌమార  సాహిత్యం లో చేర్చవచ్చు. సులోచనారాణి గారి మీనా ని కూడా నేను ఈ కోవలో చెప్తాను
ఈ పిల్ల విషయానికి వస్తే తనది విపరీతమయిన పఠనా దాహం.నాకులాగా తనకి పుస్తకాల షాపులు కలలలో వస్తూ వుంటాయి.  తను చిన్న పిల్ల కాదు, యువతీ కాదు.కొంత తెలుసు,చాలాతెలియదు..అంతా తెలుసు అనుకునే ప్రాయం ఇది ఎంత సుకుమారమో,ఎంత సుతిమెత్తగా చూసుకోవాలో! .అదృస్టవశాత్తూ ఆంగ్లం లో ఈ వయసు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు వున్నాయి.
వాటిలో పాత శతాబ్దంలో రాసినవి అన్ని ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుతాయి..నాకయితే Project Gutenberg ఒక అనంతమయిన నిధి నిక్షేపాల నిలయంలాగా అనిపిస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు సాహిత్యపరంగా అదృష్టవంతులు.ప్రతి గ్రేడ్ లోనూ వాళ్లు చదివి అర్ధం చేసుకోవలసిన పుస్తకాలు వాళ్లకి కేటాయించబడుతూ వుంటాయి.బాధంతా భారత దేశంలోని 12-16 వయసున్న  పిల్లల గురించే.
వీళ్ల పాఠ్యప్రణాళిక లో సాహిత్యానికి చాలా తక్కువ చోటు వుంది. ఈమద్య దశాబ్దం నుంచి పట్టిన విద్యా విషజ్వరం  ఏ ‘ ఇతర ‘ పుస్తకాన్ని చదివే వ్యవధి ఇవ్వటం లేదు.ఆర్ధికమయిన వెసులుబాటు ఎక్కువగా వున్న తల్లిదండ్రులు ఎంచుకునే ‘ అంతర్జాతీయ ప్రమాణాలు ‘ గల పాఠశాలలు కూడా సరయిన దారిని చూపించటం లేదు.
ఏతావాతా ఈ కౌమారంలోని పిల్లలు ‘ చిక్’ లిటరేచర్  కి అలవాటు పడుతున్నారు. వీటిలో చాలా వరకు ఏ విలువలనీ పాటించాలని అనుకోరు,కొన్ని మినహాయింపులు వున్నా.ఇబ్బంది పెట్టే ‘ చెడ్డ భాష ‘ ని యధేచ్ఛ గా వుపయోగించే ఈ పుస్తకాలు ఆలోచననీ వ్యక్తీకరణనీ కూడా దెబ్బ తీస్తున్నాయి.
కొంచెం మార్గం చూపించాలి -తల్లిదండ్రులు, దగ్గరివారు,ఉపాధ్యాయులు..ఎవరయినా. మంచి వ్యక్తిత్వానికి మూలం మంచి పుస్తకాలు చదవటమే. అయితే అవి నీతివాక్యాలు ఏకరువు పెట్టినట్లు వుండనే కూడదు.ఒకటీ రెండూ మూడూ అని అంకెలతో సూత్రాలతో నేర్పేది కాదు అది.  చాలా ‘ వ్యక్తిత్వవికాసపు పుస్తకాలు ‘ ఈ పనినే చేస్తాయి.
అది కాదు.వేర్వేరు  సందర్భాలలో వేర్వేరు  మనస్తత్వాలు ఎలా స్పందిస్తాయో -ఎలా లోబడిపోవచ్చో, ఎలా ఎదగవచ్చో -ఎలా నలుగుతారో ఎలా తెప్పరిల్లుతారో-ఈ ప్రయాణమంతా మంచి పుస్తకం అన్యాపదేశంగా మాత్రమే చెప్పాలి.ఇందుకు  ఒకే పుస్తకం సరిపోదు.చాలా,చాలా కావాలి.వాటిని వెదకాలి.
అయితే జీవితపు భయానక వాస్తవికతని ఒక్కసారిగా వీళ్లమీదకి వదలకూడదు.చీకటిని తెలియనివ్వాలి,ఆ తర్వాతి వెలుతురుని తప్పనిసరిగా చూపించాలి.తీవ్రమయిన నిరాశ,అయోమయం కలిగించే అఘాతాలు,దయలేనితనం – ఈ వయసు పిల్లలు తట్టుకోలేరు.
పరస్పరవిరుద్ఢ   భావాలని పెద్దవాళ్లు పిల్లలముందు ఎలా నియంత్రించుకుంటారో ఈ పుస్తకాలూ అలాగే వుండాలి.సంఘర్షణ వుండకుండా వీలవకపోవచ్చు,కాని అది సులభంగా అర్ధమయేలాగే వుండాలి.
ఉండదగినన్ని అనురాగపు ఛాయలు  ,అవీ నిజాయితీగా మాత్రమే వుండాలి.సంక్లిష్టమయిన ప్రేమసంబంధాలను గురించి చర్చించకపోవటం ఉత్తమం.
ఈ షరతులన్నీ వర్తించే పుస్తకాలు నా దృష్టిలోకి చాలా వచ్చాయి.సమకాలీన ఆంగ్ల సాహిత్యం లో యంగ్ అడల్ట్ విభాగం చాలా పెద్దది .అన్ని ఇ మాల్ లలోనూ ఇవి దొరుకుతాయి.చాలా మెచ్చుకోదగినవి కూడా వున్నాయి.అయితే నా దృష్టి లో గుటెంబర్గ్,క్లాసిక్ రీడర్ వంటి చోట్ల ఉచితంగా  దొరికే పుస్తకాలే వీటికన్నా  మంచివి.
వీటిని పాశ్చాత్యదేశాల్లో తొమ్మిదేళ్ల వయసునుంచే  సూచించినా ఇక్కడి పిల్లలకి పదకొండు పన్నెండేళ్ల తర్వాతే బాగుంటాయి.ఇది నా స్వానుభవం.పిల్లలని ఈ మహాతల్లుల, పెద్దమనుషుల  చేతుల్లో పెట్టి కొన్నాళ్లు నిజంగా నిశ్చింతగా వుండవచ్చు.
Frances  Hodgson Burnettరాసిన పుస్తకాలని నేను మొదట వుంచుతాను.A Little Princessలో నిబ్బరం,అభిజాత్యం అబ్బురమనిపిస్తాయి.యేబ్రాసి  పిల్లMary Lennox..The Secret Garden లో ఎలా సున్నితంగా మారుతుందో ఏమెమి కనుక్కుందో ఆసక్తిగా అనిపిస్తుంది.Little Lord Fauntleroy లో చిన్న పిల్లాడు  తనకి కొత్తగా పట్టిన అదృష్టం లో ఎలా గుక్క తిప్పుకోగలిగాడో,కఠినుడయిన  తాతగారిని ఎలా మార్చుకున్నాడో చదవటం  ముచ్చటగా వుంటుంది.
తర్వాత చెప్పవలసిందిLucy Maud Montgomery  గురించి.Anneఅనే విలక్షణమయిన అమ్మాయి గురించి చాలా నవలలు వుంటాయి.ఇంచుమించు అన్నీ హాయిగా వుంటాయి.ఈవిడే రాసినEmily trilogy సూక్ష్మమయిన పరిశీలనతో  నడుస్తుంది.నేను చదివించిన పిల్లలందరూ తమని తాము చూసుకున్నారు ఈ పాత్రలో.
తర్వాతLouisa May Alcott . .ఈవిడ రాసినLittle Women ఎప్పటికీ నచ్చుతూ  వుంటారు..అసలు ఆ పేరే ఎంత బాగుందో చూడంది..ఈవిడ ఇతర రచనలు Eight Cousins,An Old Fashioned Girl,Under the Lilacs కూడా చక్కగా వుంటాయి. Eleanor H. PorterరాసినPollyanna  పుస్తకం ఎంత ప్రసిద్ఢికెక్కినదంటే  నిరంతర ఆశావాదాన్నిPollyannaism అని పిలుస్తారు.ఈ అర్ధం నిఘంటువుకెక్కింది.Pollyanna Grows Up అని దీని తర్వాతి భాగం.పాజిటివ్  థింకింగ్ ఎంతో కొంత నేర్చుకుని తీరాలి నచ్చితేJust David అనేది  ఇంటిపేరు తెలియని  ఒక అబ్బాయి గురించి.చాలా ఉదాత్తమయిన   నవల. Edith Nesbit మరీ చిన్నపిల్లల కోసం అనుకుంటారుగానీ ఈవిడ రాసిన అద్భుతకథలు ఈ వయసులోనూ బాగుంటాయిThe House of Arden, The Railway Children ఆరోగ్యకరమయిన రచన లు .తర్వాత Kate Douglas Wiggin రాసిన  Rebecca of Sunnybrook Farm చెప్పుకోదగినది .ఈవిడదే Mother Carey’s Chickens కూడా మంచి నవల .Jules Verne మంచి సైన్స్ ఫిక్షన్  రాసాడు .20,000 Leagues under the Sea ,The Mysterious Island  ప్రసిద్ఢి  వున్న Around the World in Eighty Day బాగున్నంతా బాగుంటాయి .
Johann David Wyss  ది The Swiss Family Robinson  ఎన్నిసార్లు చదివినా బాగుంటుంది .Robert Louis Stevenson, Thomas Hughes మొదలయినవారు ప్రత్యేకించి  అబ్బాయిలకి  నచ్చే పుస్తకాలు రాసారు.
వీళ్లు కొంతమంది మాత్రమే.ఇవి కొన్ని పుస్తకాలు మాత్రమే.ఇంకెన్నో అంతేలేదు ..“If you look the right way, you can see that the whole world is a garden.”
― Frances Hodgson Burnett, the Secret Garden
mythili2
.mythili3

మమత

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. గతించినవారికి శ్రాద్ధ విధులు నిర్వర్తించేటప్పుడు కుంతీదేవి నుండి  కర్ణుడి జన్మ రహస్యం తెలుసుకున్న ధర్మరాజు పడే బాధ, ఆయన తవ్విపోసుకునే  జ్ఞాపకాలు ...ద్రవింపజేసే  ఈ నాటకీయత...చూడండి.


' దుర్మార్గులైన  కౌరవుల వల్ల సభలో బాధ చెందుతున్నప్పుడు , నాకు ఒక్కసారిగా వచ్చిన కోపం ఎందుకో కర్ణుని చూసి తగ్గిపోయేది. దుర్యోధనుని హితం కోసం, ద్యూత సభలో కర్ణుని కటువైన మాటలు విన్నప్పుడు కల్గిన కోపం, వాని పాదాలు చూసిన వెంటనే మాయమై పోయేది. ఆ కర్ణుని పాదాలు అచ్చంగా కుంతి పాదాలులాగే  ఉండేవి-అనుకొనేవాడిని.కుంతికీ, కర్ణునికీ ఈ సమాన పాదాలు ఎలా వచ్చాయా? అని ఎంత ఆలోచించినా కారణం తెలిసేది కాదు '- శాంతి పర్వం,సంస్కృత భారతానువాదం .


క.ఆతడు దుర్యోధనునకు బ్రీతిగ  జూదంబునాడు పెక్కాడెను ధ


ర్మేతరములు వానికి మచ్చేతోగతి కోపభరము సెందక యుండున్.
ఆ. అతని మేను కుంతియట్టుల కైవడి యరయ నేను జూచి యాత్మ నెద్ది


కారణంబొ యిట్లుగా ననుచుండుదు ; , నేమి  సేయువాడ నింకజెపుమ!


క. కౌరవులు సేయు నవమతి కారణముగ గోపమెత్తు , గర్ణుని వదనాం


భోరుహమున్ గనుగొన శమ మారున్ నా వశముగాక యంతన బుద్ధిన్. -శాంతి పర్వం, ప్రథమాశ్వాసం .


 మొదటి పద్యంలో మచ్చేతోగతి అంటే నా మనసు తీరు అని.


సంస్కృతం లో ఇద్దరి పాదాలలో కనిపించిన  అంతుబట్టని సామ్యాన్ని సున్నితంగా చెప్తే,తిక్కనగారు దాన్ని విస్తరించారు.
రెండో పద్యంలో ...కైవడి అంటే పోలిక. ఏమిసేయువాడనింక  అనిపిస్తున్నారు తిక్కన గారు...ఇప్పటికీ మనం వాడే ' అంతా అయ్యే పోయింది,  నన్నింకేం చేయమంటావు ! ' అనే తెలుగు  పలుకుబడి.


మూడో పద్యంలో నా బుద్ధి  నా చేతిలో ఉండేది కాదు అంటున్నాడు...ఆ చక్కని  మొహం చూస్తే ప్రాణానికి హాయిగా ఉండేదెందుకో అంటున్నాడు.


 తప్పించుకోలేని జనన సౌహృదం, పట్టిలాగే రక్తబంధం, ఎందుకో తెలియకపోవటం...చేయిదాటిపోయాక గగ్గోలు పెట్టటం ...ఇంతకన్న గొప్పగా ఎక్కడయినా రాసి పెట్టారా? 

స్వర్గానికి నిచ్చెనలు

స్వర్గానికి నిచ్చెనలు మూడోసారి చదివి పూర్తి చేశాను.మొదటిసారి కథ తెలుసుకోవటం కోసం,రెండోసారి ఒప్పుకోగలనా అని చూడటం కోసం.ఒప్పుకోలేకపోయాను. ఏమీ ఆశించకుండా రచయిత ఏమి చెప్తున్నారో తెలుసుకోవటానికి ఇప్పుడు చదివాను.మంత్రముగ్ధురాలి వలె రచయితతో ప్రయాణించాను.తర్కం,మీమాంస..వేదన,కారుణ్యం..ఆలోచనకి అవకాశంలేని దయనీయస్థితిలో ఆపాతమధురమయిన సంగీతం వీణానాదంగా జీవనపాథేయంగా ఇలాగ,ఈవైపునుంచి-ఉత్థానానికి ,కనీసం శాంతికి

నా విశ్వనాథ



ఆయనకీర్తిశేషులైన  నాటికి నావయసు పది సంవత్సరాలు..ఆస్థానకవి అని తప్ప ఇంకా ఏమీ తెలియదు .తర్వాతి కాలంలో విన్నది ఆయనను గురించి వ్యతిరేకోక్తులనే... చదివిన తొలి నవల చెలియలికట్ట మనస్సుకెక్కనూలేదు పదిహేడేళ్ల వయసులో. స్వైరం లో మాత్రమే సౌందర్యం చూసే అజ్ఞానం అప్పటికి,   నియమాలెందుకు ఎట్లా ఆవశ్యకమో తెలియదు.
 గుంటూరు నవోదయా బుక్ స్టోర్ లో ఒక పై అరలో పెద్ద పెద్ద పుస్తకాలు.. సముద్రపు దిబ్బ, మ్రోయు తుమ్మెద కనిపిస్తూ ఉండేవి. తీసుకుందామనిపించినా భయం వేస్తూ ఉండేది చదవగలనా అని. [ కొన్ని యేళ్ల తర్వాత వెళ్లి పిచ్చిదానిలాగా అడిగాను ఆపుస్తకాలేమయినాయని. అక్కడివారెవరికీ గుర్తే లేదట. ]చిన్నగా కనిపించిన నాస్తికధూమం, హెలీనా తీసుకున్నాను. ప్రయాసతో చదివాను.అవి  అసలేమి చెప్తున్నాయో . అంతుపట్టలేదు. ఏకవీరలోని వేదన అర్థరహితమనీ అనుకున్నాను. ఒక్క హా హా హూ హూ మాత్రం ఆకర్షించింది.
కష్టపడి సంపాదించి వేయిపడగలూ చుట్టబెట్టీ ఒక్క దీవెనా పొందలేదు, అప్పటికింకా బహుశా అది సమయం కాదు.

వివాహమై, బిడ్డల తల్లినయి, ఇరవై ఆరేళ్లు నిండుతూన్నప్పుడు , 1992 లో మళ్ళీ మొదలుపెట్టినప్పుడు తెలిసిందని అనిపించింది ఉద్గ్రంథం ఏమిటో, ఎందుకో. పదే పదే ప్రతిదినమూ పారాయణ వంటిది చేసి, నా చుట్టూ లోకాన్నంతా మరి ఇంకొకలాగా చూసి, వెతకటం మొదలుపెట్టాను ఇంకా ఏమేమి చెప్పారని. తిరిగి ఏకవీర, సిం హళ రాజకుమారుడి స్నేహఫలము..అంతే.
ఒక ఉత్తరం రాశాను ' గ్రంథకర్త కుమారులకి '  'అమ్మా, నమః అని ప్రారంభించి జవాబు ఇచ్చారుపావని   శాస్త్రి గారు.
ఆయన ఇల్లంటూ ఒకటి ఉందని ఆశ్చర్యపడుతూ వెళ్లి  చూశాను. ఇక్కడ పడక, ఇక్కడ జపం, ఇక్కడ రచన...హృదయంలో కైమోడ్చాను.
శాస్త్రిగారి పితృప్రేమ ఎన్నదగినది..   ఆధునిక పాఠకులకు విశ్వనాథని పరిచయం చేయాలనే తాపత్రయంతో. పులిమ్రుగ్గుని సరళవ్యావహారికంలో తిరగరాసి ఉన్నారు.అచ్చులోలేని పుస్తకాలని అందుబాటులోకి తేవాలనే గట్టి తపన. చిన్న కథల సంపుటిని
ముందుగా  వేశారు. మెల్లిగా చారిత్రక నవలలు అన్నీ ప్రచురించారు. మంగళగిరి లో ఉద్యోగం చేస్తూ ఉండే మా నాన్నగారు ఒక మంచిరోజున విజయవాడనుంచి కట్టను మోసుకొచ్చారు మా ఊరికి. అన్నిటినీ అతురనై పదిరోజులలో ముగించాను. పురాణవైర గ్రంథమాల మొత్తమూ, కాశ్మీర, నేపాళరాజవంశ నవలలూ, ధర్మ చక్రము, కడిమిచెట్టు వంటి ఇతరాలూ వాటిలో ఉన్నాయి.  భారతదేశ చరిత్రని స్పర్ధతో, కూటనీతితో, ఆంగ్లేయులు ఎట్లా మార్చారో కొన్ని వారాలపాటు అందరికీ చెప్పుకున్నాను. ప్రతిపుస్తకపు వెనక అట్టమీద ఇంకా దొరకని పుస్తకాలు కనిపించేవి.
 తె ఱ చిరాజు, స్వర్గానికి నిచ్చెనలు , పాతవి, వంశీ  బుక్ స్టాల్ లో దొరికాయి.[ స్వర్గానికి నిచ్చెనలు మూడోసారికి గాని అర్థమవలేదు. తె ఱ చిరాజు ఇంకా మొత్తం తెలియలేదు. ] దేవతల యుద్ధము, పులుల సత్యాగ్రహము, నర్తనశాల నాటకం కూడా  పాతవి అక్కడే దొరికాయి.

 కోవెల సంపత్కుమారాచార్య గారు వేసిన రూపకాలు- సంపాదకీయాలు, పీఠికలు దొరికాయిసరిపోలేదు.
ఈలోపు పావనిశాస్త్రి గారు దివంగతులైనారు. రచన లో ' సీత ' రాశారు అచ్యుతదేవరాయలు. ఒకేసారి ప్రౌఢమూ సుకుమారమూ
అయిన వ్యక్తీకరణలో, శ్రీవిద్యాన్వయంలో, వాక్యాల విరుపులో తండ్రిగారు దర్శనమిచ్చారనిపించింది. వేయిపడగలు లోని చిన్న రామేశ్వరశాస్త్రి కదా వారు.. చాలా కాలం క్రితం 'కైక ' కూడా రాశారు . వారి  వెంటబడి నందమూరు వెళ్లాను. ఆయన ఇల్లుండిన వీధి, చుట్టూ మాగాణి, వేయిపడగలు లోని వేణుగోపాలస్వామి గుడి, విశ్వనాథ శోభనాద్రిగారు ప్రతిష్టించిన ' మా స్వామి ' విశ్వేశ్వరుని ఆలయం...అన్నీ తిరిగాను. అచ్యుతదేవరాయలను అడిగాను ' మీరచన మీ తండ్రిగారిదివలె ఉంటుందికదా ' అని. ఆయన అంగీకరించలేదు, తన పైన నన్నయ్య గారి ప్రభావం మాత్రం ఉందన్నారు. ' మీరు నాన్న పోలికా అమ్మ పోలికా ' అని అడిగాను...' మా అమ్మ పోలికే మొత్తం ' అన్నారు సగర్వంగా. ప్రాణం ఉసూరుమన్నది. ఆయన చిన్నప్పుడు తండ్రికి దూరమయి బంధువుల ఇంట్లో పెరిగారని జ్ఞాపకం వచ్చి ' అయ్యో ' అనిపించింది. అయినా వారిని అడిగాను పుస్తకాలు  వేయండీ అని. అక్కడే ఉన్న పెద్ద వయసు రైతు ఒకరి నోటివెంట విశ్వనాథ వారి ఆకార విశేషాలను విని కాస్త శమించాను.
  తర్వాత సంవత్సరం న్నర కి దొరికాయి మొత్తం నవలలూ, నాటకాలు, నాటికల సంపుటులు. వారసులు ప్రచురించారు. అమితమైన ఉత్కంఠతో ఎదురుచూసి పెట్టెలని ఇంటికి తెచ్చుకున్న రోజు ఇప్పటికీ గుర్తు ఉంది.
తెలుగు ఋతువులు,  వరలక్ష్మీ త్రిశతి, కిన్నెరసాని పాటలు వంటి కొన్ని టిని మినహాయిస్తే నా పరిజ్ఞానం తొంభయి శాతం వచనరచనల పైన ఆధారపడినదే. కల్పవృక్షం ఛాయలోకి నెమ్మదిగా ప్రయాణిస్తున్నాను.
మొత్తం నవలలూ నాచేతికి వచ్చేనాటికి డ్యూమాస్ ని, డికెన్స్ ని, విక్టర్ హ్యూగో ని, జార్జ్ ఇలియట్ ని, జేన్ స్టిన్ ని సందర్శించాను, ఇంకా కొందరు స్రష్టలను కూడా. వీరెవ్వరూ విడివిడిగా ఒక్కరూ విశ్వనాథ తో సరి తూగలేరు. కొంతమంది కలిస్తే, కొన్ని చోట్ల..ఏమో ! షేక్స్పియర్ ను నేను చదవలేదు కనుక ప్రస్తావన చేయను.
మాస్తి వేంకటేశ అయ్యంగార్ కంటే, శివరామ కారంత్ కంటే, కల్కి కృష్ణమూర్తి కంటే, ఎం.టి.వాసుదేవన్ నాయర్ కంటే... నవలా రచనలో విశ్వనాథ గొప్పవారు...[ నేను చదివినవి అనువాదాలే అయినా.] ఆయా రచయితలను ప్రజలు ఎట్లా ఔదలదాల్చారో ఒక్కసారి గమనిస్తే....