Tuesday 5 November 2013

మమత

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. గతించినవారికి శ్రాద్ధ విధులు నిర్వర్తించేటప్పుడు కుంతీదేవి నుండి  కర్ణుడి జన్మ రహస్యం తెలుసుకున్న ధర్మరాజు పడే బాధ, ఆయన తవ్విపోసుకునే  జ్ఞాపకాలు ...ద్రవింపజేసే  ఈ నాటకీయత...చూడండి.


' దుర్మార్గులైన  కౌరవుల వల్ల సభలో బాధ చెందుతున్నప్పుడు , నాకు ఒక్కసారిగా వచ్చిన కోపం ఎందుకో కర్ణుని చూసి తగ్గిపోయేది. దుర్యోధనుని హితం కోసం, ద్యూత సభలో కర్ణుని కటువైన మాటలు విన్నప్పుడు కల్గిన కోపం, వాని పాదాలు చూసిన వెంటనే మాయమై పోయేది. ఆ కర్ణుని పాదాలు అచ్చంగా కుంతి పాదాలులాగే  ఉండేవి-అనుకొనేవాడిని.కుంతికీ, కర్ణునికీ ఈ సమాన పాదాలు ఎలా వచ్చాయా? అని ఎంత ఆలోచించినా కారణం తెలిసేది కాదు '- శాంతి పర్వం,సంస్కృత భారతానువాదం .


క.ఆతడు దుర్యోధనునకు బ్రీతిగ  జూదంబునాడు పెక్కాడెను ధ


ర్మేతరములు వానికి మచ్చేతోగతి కోపభరము సెందక యుండున్.
ఆ. అతని మేను కుంతియట్టుల కైవడి యరయ నేను జూచి యాత్మ నెద్ది


కారణంబొ యిట్లుగా ననుచుండుదు ; , నేమి  సేయువాడ నింకజెపుమ!


క. కౌరవులు సేయు నవమతి కారణముగ గోపమెత్తు , గర్ణుని వదనాం


భోరుహమున్ గనుగొన శమ మారున్ నా వశముగాక యంతన బుద్ధిన్. -శాంతి పర్వం, ప్రథమాశ్వాసం .


 మొదటి పద్యంలో మచ్చేతోగతి అంటే నా మనసు తీరు అని.


సంస్కృతం లో ఇద్దరి పాదాలలో కనిపించిన  అంతుబట్టని సామ్యాన్ని సున్నితంగా చెప్తే,తిక్కనగారు దాన్ని విస్తరించారు.
రెండో పద్యంలో ...కైవడి అంటే పోలిక. ఏమిసేయువాడనింక  అనిపిస్తున్నారు తిక్కన గారు...ఇప్పటికీ మనం వాడే ' అంతా అయ్యే పోయింది,  నన్నింకేం చేయమంటావు ! ' అనే తెలుగు  పలుకుబడి.


మూడో పద్యంలో నా బుద్ధి  నా చేతిలో ఉండేది కాదు అంటున్నాడు...ఆ చక్కని  మొహం చూస్తే ప్రాణానికి హాయిగా ఉండేదెందుకో అంటున్నాడు.


 తప్పించుకోలేని జనన సౌహృదం, పట్టిలాగే రక్తబంధం, ఎందుకో తెలియకపోవటం...చేయిదాటిపోయాక గగ్గోలు పెట్టటం ...ఇంతకన్న గొప్పగా ఎక్కడయినా రాసి పెట్టారా? 

No comments:

Post a Comment