Tuesday 5 November 2013

కౌమారపు పూలతోట

ఈ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది ..రహస్యాలు గుసగుసగా వినపడుతూ వుంటాయి..
నీ అడుగు ఎక్కడ పడుతోందో గమనించుకుంటావు కదూ
‘ నా పన్నెండేళ్ల మేనగోడలికి బహుమతి ఇస్తూన్న ‘ ద సీక్రెట్ గార్డెన్ ‘ పుస్తకం మొదటి పుట లో ఈ మాటలు రాశాను.ఈ నవల శీర్షికని దాని అంతర్ధ్వని కోసం ఇష్టపడతాను..
లోపలి తలుపులూ బయటి తలుపులూ తెరుచుకుంటూ కనిపింపచేసే అందమయిన ఆరామంగా ఆ వయసు వుండాలి.అది ఆదర్శమవనీ,స్వప్నమే అవనీ..అక్కడ కొన్నాళ్లు నిలవాలి.
ఈ అమ్మాయి తెలుగు బాగా చదువుతుంది. చందమామ వాళ్లు గొప్ప దయతో ఏర్పరచిన పాత సంచికల భాండాగారాలన్నీ చదివేసుకుంది.ఎనిడ్ బ్లైటన్  పుస్తకాలన్ని అయ్యే పోయాయి. ఇప్పుడు తను తెలుగులో చదవదగిన  కథా సంకలనాలు కొన్ని వున్నా నవలలు ఎన్నో లేవు. మార్క్ ట్వేన్ ని తెలుగులోకి తెచ్చి అంతతో ఆగిపోయారు నండూరి రామమోహనరావు గారు. ముళ్లపూడి వారు భూప్రదక్షిణం ఒక్కటే అనువదించారు. టాం సాయర్ ని తెలుగు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు, ఆవరసలో రావలసిన ఇతర సాహిత్యమేదీ తెలుగులోకి రాలేదు.
బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం బాగా నచ్చి తర్వాతి కథ చదవబోయిన పిల్లలకి ఆశాభంగమవటం నేను చూశాను. శ్రీ  పాద వారి వడ్లగింజలూ,మార్గదర్శీ కౌమార  సాహిత్యం లో చేర్చవచ్చు. సులోచనారాణి గారి మీనా ని కూడా నేను ఈ కోవలో చెప్తాను
ఈ పిల్ల విషయానికి వస్తే తనది విపరీతమయిన పఠనా దాహం.నాకులాగా తనకి పుస్తకాల షాపులు కలలలో వస్తూ వుంటాయి.  తను చిన్న పిల్ల కాదు, యువతీ కాదు.కొంత తెలుసు,చాలాతెలియదు..అంతా తెలుసు అనుకునే ప్రాయం ఇది ఎంత సుకుమారమో,ఎంత సుతిమెత్తగా చూసుకోవాలో! .అదృస్టవశాత్తూ ఆంగ్లం లో ఈ వయసు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు వున్నాయి.
వాటిలో పాత శతాబ్దంలో రాసినవి అన్ని ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుతాయి..నాకయితే Project Gutenberg ఒక అనంతమయిన నిధి నిక్షేపాల నిలయంలాగా అనిపిస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు సాహిత్యపరంగా అదృష్టవంతులు.ప్రతి గ్రేడ్ లోనూ వాళ్లు చదివి అర్ధం చేసుకోవలసిన పుస్తకాలు వాళ్లకి కేటాయించబడుతూ వుంటాయి.బాధంతా భారత దేశంలోని 12-16 వయసున్న  పిల్లల గురించే.
వీళ్ల పాఠ్యప్రణాళిక లో సాహిత్యానికి చాలా తక్కువ చోటు వుంది. ఈమద్య దశాబ్దం నుంచి పట్టిన విద్యా విషజ్వరం  ఏ ‘ ఇతర ‘ పుస్తకాన్ని చదివే వ్యవధి ఇవ్వటం లేదు.ఆర్ధికమయిన వెసులుబాటు ఎక్కువగా వున్న తల్లిదండ్రులు ఎంచుకునే ‘ అంతర్జాతీయ ప్రమాణాలు ‘ గల పాఠశాలలు కూడా సరయిన దారిని చూపించటం లేదు.
ఏతావాతా ఈ కౌమారంలోని పిల్లలు ‘ చిక్’ లిటరేచర్  కి అలవాటు పడుతున్నారు. వీటిలో చాలా వరకు ఏ విలువలనీ పాటించాలని అనుకోరు,కొన్ని మినహాయింపులు వున్నా.ఇబ్బంది పెట్టే ‘ చెడ్డ భాష ‘ ని యధేచ్ఛ గా వుపయోగించే ఈ పుస్తకాలు ఆలోచననీ వ్యక్తీకరణనీ కూడా దెబ్బ తీస్తున్నాయి.
కొంచెం మార్గం చూపించాలి -తల్లిదండ్రులు, దగ్గరివారు,ఉపాధ్యాయులు..ఎవరయినా. మంచి వ్యక్తిత్వానికి మూలం మంచి పుస్తకాలు చదవటమే. అయితే అవి నీతివాక్యాలు ఏకరువు పెట్టినట్లు వుండనే కూడదు.ఒకటీ రెండూ మూడూ అని అంకెలతో సూత్రాలతో నేర్పేది కాదు అది.  చాలా ‘ వ్యక్తిత్వవికాసపు పుస్తకాలు ‘ ఈ పనినే చేస్తాయి.
అది కాదు.వేర్వేరు  సందర్భాలలో వేర్వేరు  మనస్తత్వాలు ఎలా స్పందిస్తాయో -ఎలా లోబడిపోవచ్చో, ఎలా ఎదగవచ్చో -ఎలా నలుగుతారో ఎలా తెప్పరిల్లుతారో-ఈ ప్రయాణమంతా మంచి పుస్తకం అన్యాపదేశంగా మాత్రమే చెప్పాలి.ఇందుకు  ఒకే పుస్తకం సరిపోదు.చాలా,చాలా కావాలి.వాటిని వెదకాలి.
అయితే జీవితపు భయానక వాస్తవికతని ఒక్కసారిగా వీళ్లమీదకి వదలకూడదు.చీకటిని తెలియనివ్వాలి,ఆ తర్వాతి వెలుతురుని తప్పనిసరిగా చూపించాలి.తీవ్రమయిన నిరాశ,అయోమయం కలిగించే అఘాతాలు,దయలేనితనం – ఈ వయసు పిల్లలు తట్టుకోలేరు.
పరస్పరవిరుద్ఢ   భావాలని పెద్దవాళ్లు పిల్లలముందు ఎలా నియంత్రించుకుంటారో ఈ పుస్తకాలూ అలాగే వుండాలి.సంఘర్షణ వుండకుండా వీలవకపోవచ్చు,కాని అది సులభంగా అర్ధమయేలాగే వుండాలి.
ఉండదగినన్ని అనురాగపు ఛాయలు  ,అవీ నిజాయితీగా మాత్రమే వుండాలి.సంక్లిష్టమయిన ప్రేమసంబంధాలను గురించి చర్చించకపోవటం ఉత్తమం.
ఈ షరతులన్నీ వర్తించే పుస్తకాలు నా దృష్టిలోకి చాలా వచ్చాయి.సమకాలీన ఆంగ్ల సాహిత్యం లో యంగ్ అడల్ట్ విభాగం చాలా పెద్దది .అన్ని ఇ మాల్ లలోనూ ఇవి దొరుకుతాయి.చాలా మెచ్చుకోదగినవి కూడా వున్నాయి.అయితే నా దృష్టి లో గుటెంబర్గ్,క్లాసిక్ రీడర్ వంటి చోట్ల ఉచితంగా  దొరికే పుస్తకాలే వీటికన్నా  మంచివి.
వీటిని పాశ్చాత్యదేశాల్లో తొమ్మిదేళ్ల వయసునుంచే  సూచించినా ఇక్కడి పిల్లలకి పదకొండు పన్నెండేళ్ల తర్వాతే బాగుంటాయి.ఇది నా స్వానుభవం.పిల్లలని ఈ మహాతల్లుల, పెద్దమనుషుల  చేతుల్లో పెట్టి కొన్నాళ్లు నిజంగా నిశ్చింతగా వుండవచ్చు.
Frances  Hodgson Burnettరాసిన పుస్తకాలని నేను మొదట వుంచుతాను.A Little Princessలో నిబ్బరం,అభిజాత్యం అబ్బురమనిపిస్తాయి.యేబ్రాసి  పిల్లMary Lennox..The Secret Garden లో ఎలా సున్నితంగా మారుతుందో ఏమెమి కనుక్కుందో ఆసక్తిగా అనిపిస్తుంది.Little Lord Fauntleroy లో చిన్న పిల్లాడు  తనకి కొత్తగా పట్టిన అదృష్టం లో ఎలా గుక్క తిప్పుకోగలిగాడో,కఠినుడయిన  తాతగారిని ఎలా మార్చుకున్నాడో చదవటం  ముచ్చటగా వుంటుంది.
తర్వాత చెప్పవలసిందిLucy Maud Montgomery  గురించి.Anneఅనే విలక్షణమయిన అమ్మాయి గురించి చాలా నవలలు వుంటాయి.ఇంచుమించు అన్నీ హాయిగా వుంటాయి.ఈవిడే రాసినEmily trilogy సూక్ష్మమయిన పరిశీలనతో  నడుస్తుంది.నేను చదివించిన పిల్లలందరూ తమని తాము చూసుకున్నారు ఈ పాత్రలో.
తర్వాతLouisa May Alcott . .ఈవిడ రాసినLittle Women ఎప్పటికీ నచ్చుతూ  వుంటారు..అసలు ఆ పేరే ఎంత బాగుందో చూడంది..ఈవిడ ఇతర రచనలు Eight Cousins,An Old Fashioned Girl,Under the Lilacs కూడా చక్కగా వుంటాయి. Eleanor H. PorterరాసినPollyanna  పుస్తకం ఎంత ప్రసిద్ఢికెక్కినదంటే  నిరంతర ఆశావాదాన్నిPollyannaism అని పిలుస్తారు.ఈ అర్ధం నిఘంటువుకెక్కింది.Pollyanna Grows Up అని దీని తర్వాతి భాగం.పాజిటివ్  థింకింగ్ ఎంతో కొంత నేర్చుకుని తీరాలి నచ్చితేJust David అనేది  ఇంటిపేరు తెలియని  ఒక అబ్బాయి గురించి.చాలా ఉదాత్తమయిన   నవల. Edith Nesbit మరీ చిన్నపిల్లల కోసం అనుకుంటారుగానీ ఈవిడ రాసిన అద్భుతకథలు ఈ వయసులోనూ బాగుంటాయిThe House of Arden, The Railway Children ఆరోగ్యకరమయిన రచన లు .తర్వాత Kate Douglas Wiggin రాసిన  Rebecca of Sunnybrook Farm చెప్పుకోదగినది .ఈవిడదే Mother Carey’s Chickens కూడా మంచి నవల .Jules Verne మంచి సైన్స్ ఫిక్షన్  రాసాడు .20,000 Leagues under the Sea ,The Mysterious Island  ప్రసిద్ఢి  వున్న Around the World in Eighty Day బాగున్నంతా బాగుంటాయి .
Johann David Wyss  ది The Swiss Family Robinson  ఎన్నిసార్లు చదివినా బాగుంటుంది .Robert Louis Stevenson, Thomas Hughes మొదలయినవారు ప్రత్యేకించి  అబ్బాయిలకి  నచ్చే పుస్తకాలు రాసారు.
వీళ్లు కొంతమంది మాత్రమే.ఇవి కొన్ని పుస్తకాలు మాత్రమే.ఇంకెన్నో అంతేలేదు ..“If you look the right way, you can see that the whole world is a garden.”
― Frances Hodgson Burnett, the Secret Garden
mythili2
.mythili3

No comments:

Post a Comment