Friday 8 November 2013

కలల ఇంటి చిరునామా

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి, మోయలేని ఈ హాయిని మోయనీ, ఒక్క క్షణం ” అంటే అర్థమయినట్లే ఉండేది.


కృష్ణశాస్త్రి గారు విడిగా  కవిగా పరిచయమయేనాటికి పదమూడేళ్లు నిండాయి నాకు. ” కృష్ణపక్షమ్మొకటె నాకు మిగిలె ” …ఈ వాక్యాలు నా లోపలి దేనికో ఆకృతినిచ్చినట్లు అనిపించింది , ప్రాణస్నేహితురాలిని వదిలి ఉండటం అనే తీవ్రమైన దుఃఖం లో ఉన్నప్పుడు .అది  ఇప్పుడు తలచుకున్నా అవమానంగా ఏమీ అనిపించదు. ఆత్మీయులకి దూరం కావటం కంటె శోకమన్నది లేదని ఈ నాటికీ తోస్తుంది, విధి అనుమతించినన్నాళ్లూ  అహర్నిశలూ చూస్తూ ఉండగలగటం కన్న కోరుకోవలసిన ఆనందమేమీ  లేదు, ఎప్పటికీ.
ఈ మధ్య బుజ్జాయి  గారు రాసిన ‘ నాన్న-నేను ‘ చదివాక కృష్ణశాస్త్రి గారి దృక్పథం తెలిసింది.
” నావలె అతడున్మత్త భావమయశాలి, ఆగికోలేడు రేగు ఊహలనొకింత ! ఇంత చిరు గీతి ఎద వేగిరించునేని పాడుకొనును, తాండవనృత్యమాడుకొనును ”  ఈ మాటలు ఇంచుమించు మూడు దశాబ్దాలు నా జీవితపు టాగ్ లైన్ లు గా ఉండేవి. ఆ రెపరెపలాడిపోయేతనమే నడుపుతూ ఉండేది నన్ను, అలా గాలికి కొట్టుకుపోతూనే  ఉండేదాన్ని.నేల మీద నిలిపేందుకూ  వేరే రచయితలు  ప్రయత్నిస్తూ  ఉండేవారు, కాని  కాలు నిలిస్తేనా !
శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు  ఉంటారా ?   దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.
పదిహేడేళ్లు వచ్చేనాటికి అమృతవీణ, మంగళ కాహళి, వ్యాసాల సంపుటులు నాలుగూ విడుదలయాయి. ఆ వచనం ఎంత మార్దవంగా,  రుచిరార్థ  సమ్మితంగా ఉండేదని ! శ్రీశ్రీ గారు రాసిన వ్యాఖ్యానంతో వచ్చాయి అవి. ” ఇక్షుసముద్రం ఎక్కడుందో చూశారా  ” అని మొదలవుతుంది అది. ఆస్వాదానికి ఆహ్వానంతోబాటు చిన్న అవమానమూ ఉంది అక్కడ ” ఇంకా మీరు కోరుకునే ఎన్నో మసాలాలున్నాయి ” అనే మాటల వెనక. అది శ్రీ  శ్రీ ఉద్దేశించారో లేదో నాకు తెలియదు. కృష్ణశాస్త్రి గారి కవిత్వపు, సామీప్యపు ఇంద్రజాలానికి బలంగా లోనయి బయటపడినవారిలో శ్రీ శ్రీ ఒకరని అప్పటికి తెలియదు.
కవితాప్రశస్తి  వ్యాసాలలో ‘ కరుణ ‘ అనేది చాలా కాలం ఊపివేసేది. దుఃఖించేవాడి  గురించి ” అతను తెలిసిపోతాడు , అతని దగ్గర చెప్పులు వదలి తల దించుకుంటాము ” అంటారు. అంతకన్న చెప్పవలసినది లేదు.లిరిక్  శిల్పం అనే వ్యాసమూ నాకు చాలా ఇష్టం. మంత్రపుగవాక్షాల  గురించీ, ప్రమాదభరిత సాగరాల గురించీ కీట్స్ కవితా పంక్తుల  పరిచయం అక్కడే .
కవి పరంపర అనే వ్యాసాల వరసలో ” నా కంటికి తిక్కన్న గారు పొడుగ్గా ఉంటా డు ‘ లాంటి వాక్యాలతో పదచిత్రాలతో ఆయా కవుల రూపురేఖా విలాసాలని బొమ్మ కట్టిచూపటం విపరీతంగా ఆకర్షించేది . మృత్యువు కన్నా నల్లని అన్యాయాలను సహించటం  ” అని మొదలయే గీతం గా నన్ను పరిపాలించింది అప్పటిలో.
 మహావ్యక్తులు సంపుటం లో చిత్త రంజన్   దాస్ గారి గురించిన వ్యాసం బలంగా  ఉంటుంది.ఆయన రచన కి  బహుశా కృష్ణశాస్త్రి గారే చేసిన అనువాదం ” ఆశకు కూడా అతీతమయిన కష్టాలు  పడటం, రాతిరి కన్నా
మన నాయనమ్మ కంటే కొన్నిసార్లు మనకి గాంధారి ఎంత బాగా తెలుస్తుందో చెబుతారు ఇంకొక చోట, ఇతిహాసాల గురించిన  ప్రస్తావనలో.
పొద్దున్నే లేవలేని నా బద్ధకానికీ పద్యం ఎప్పటికీ సమర్థింపు
” తల్లిరేయి, ఆమె చల్లని యొడిపైని నిదురపొమ్ము
నిదుర నిదుర కొక్క కల వెలుంగు పసిడి జలతారు  అంచురా
మేలుకొనకు కల వేళ, తండ్రి ! ”
అమృతవీణ దినదినాహారం అప్పుడు. గుంటూరు లో అరుదుగా దొరికే సిం హాచలం  సంపంగి పూరేక్కలు దాచుకున్నాను ఆ పుటలలో, ఉన్నాయి ఇంకా. ప్రేమ లోని, అర్పణ లోని ఎన్ని మన స్స్థితులను  చెప్పారో ఆయన అందులో. ” చిన్ని పూవు పదములపై ఒకటే, కన్నీటి చుక్కలాపై రెండే ” అనే ఏకాంత దర్శనం ఒకసారి, ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని  ఎలాగ  పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.
ఆ రోజులలోనే మొదటిసారి మల్లీశ్వరి  చూడగలిగాను. ఏమో, అందరూ ఏమేమి అంటారో నాకు తెలియదు, అది కృష్ణశాస్త్రి గారి కృతి నాకు, అంతే… కనీసం ప్రధానంగా.నల్ల కనుల నాగస్వరం మోగుతూనే ఉంది…. వెండివెన్నెల గొలుసులకు వ్రేలాడిన రేయి ఊయల ఊగుతూనే ఉంది….
స్వాప్నికలోకానికి ఈవల ఎన్నో జరిగితీరుతాయి తప్పదు, నాకూనూ. ఆ   గాటంపుకౌగిలి వదలి కనులు వేరేలా తెరచిచూడవలసిందే. నా లోపలి నన్ను పదిలపరచుకుంది వారివలన. వారే చెప్పిన మాటలు … అవకాశం దొరుకుతూనే పిల్లలని వినమనే మాటలు, జీవనసంరంభం  నడిమధ్యని నిలవలేవు,  దూరమయి నిభాయించుకోలేవు , అందుకే
” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో ! ”

                               [సారంగ లో వచ్చిన వ్యాసం ] 


No comments:

Post a Comment