Tuesday 5 November 2013

Mitwa

'' మతిలేని వెతుకులాట ముగించేయి , ఇంక చాలు. చెప్పక్కరలేని మాట తెలిసిపోవటం లేదా, ఆలకించి తీరాలా? రెపరెపలాడే హృదయం పాడుతోంది అది కాదా ? నిన్ను నువ్వు దాచుకొనే చోటెక్కడ దొరుకుతుంది ! వాల్లభ్యపు  వేదిక   సిద్ధం,ఉన్మాదీ,  నాట్యం కోసం!    అనురాగపు ఆ దారిన ఆమె నడిచి రాగానే బ్రతుకులోని వెలితులన్ని ఒకేసారి నిండాకా... అన్నిప్రశ్నలవసరమా తానే అవునో కాదో? నీ తృష్ణకు స్రోతస్విని కనపడినా  పెదవి విడదా? '' కనుగొన్నప్పటి ఉత్సవం, తెలుసుకున్నప్పటి సంబరం. శంకర్ అహ్ సాన్ లాయీ చేసినది మూడుపద్ధతుల రుచిర  మిశ్రమం. శంకర్ మహదేవన్ ఇంచుమించు ప్రతి పాటలోనూ కర్ణాటకం ధ్వనింపచేస్తారు, ఈ చోటా ఉంటాయా చాయలు. శ్రవణ సుభగమయిన హిందూస్తానీ జంత్రాలు కిన్నెరల లోకానికి రవాణా చేస్తాయి. ఆ వెనక వినపడే ఆధునిక పాశ్చాత్యం బహుశా అవసర నేపథ్యం . జావేద్ అఖ్తర్ ఈ తరపు అదృష్టం. ' అల్పాక్షరాలలో అనల్పార్థాలు ' అనుకోవటమూ ఆడంబరమే, అంత సహజమా అందం. . శంకర్ మహదేవన్ స్వరం చేసే సంచారం ఊహించలేము. షఫ్ క్వత్ అమానత్ అలీ గాత్రం చెప్పనలవి కానంత గొప్ప ఇక్కడ. ' జో హే అన్ కహీ, జో హే అన్ సునీ ' అన్నప్పుడు  ప్రాణం సుఖంగా సుడులు తిరుగుతుంది. నా దృష్టికి ఇది ఒక ఆధునికమైన క్లాసిక్. ఖమాస్ అనిపిస్తుంది కొన్ని చోట్ల, మాండ్ ఇంకొన్ని చోట్ల...ఏదీ కాదేమో కూడా, రాగరంజితం మాత్రం అవును.  

http://rkmania.me/download_free_mp3_song-mitwa_kabhi_alvida_naa_kehna-3649

No comments:

Post a Comment