Tuesday 5 November 2013

malati chandur garu

70 ల చివర్లో ఇంగ్లీష్ చదువుకున్నవారు గౌరవించిన ఒకే రచయిత్రి మాలతీ చందూర్ గారు. అలాంటివారిలో ఒకరు మా మామయ్య.ఆ పన్నెండు పదమూడేళ్ల వయసులో నేను సరయిన పుస్తకాలు చదవటలేదూ అని చాలా అక్కర ఉండేది ఆయనకి. నా తెలుగు మీడియం ఇంగ్లీష్ తో ఏ పుస్తకాన్ని ప్రయత్నించాలన్నా కష్టంగానే ఉండేది. ' నవలలు, నారీమణులు ' అనేది ఆవిడ ఆంగ్లనవలలా పరిచయాల సంపుటి.' ఇదిగో చదువు ' అని ఇచ్చాడు ఆయన. గమ్మత్తేమిటంటే ఆవిడ తెలుగు నచ్చేసింది నాకు. అందులో పేర్కొన్న ఏ నవలనీ అప్పుడు చదవలేను అనే' వివేకం ' భాసించింది ఎందుకో. గాన్ విత్ ద విండ్, రెబెక్కా,డోరియన్ గ్రే , ఫౌంటెన్ హెడ్ వంటి కొన్ని తప్పితే నేను చదివిన   ఆంగ్లసాహిత్యమంతా  2000 సంవత్సరం తర్వాత చదివినదే. అందువలన ఆమెని స్వతంత్ర రచయిత్రిగానే అభిమానిస్తాను.రెండు ఎం. యే లు చదివి ఉద్యోగం రాని ఒకాయన నెల్లూరు బాలాజీనగర్ లో లెండింగ్ లైబ్రరీ నడిపేవారు . ' కృష్ణాతీరం ' వంటి పుస్తకాలు కూడా ఉండేవి అక్కడ. కౌసల్యాదేవి గారు, సులోచనారాణి గారు...వీళ్లతోబాటు మాలతీచందూర్ గారి పూర్తి కలెక్షన్ అక్కడే చదివేశాను.' ఆలోచించు ' చదివినప్పుడు కోపం వచ్చింది. ' ఎన్ని మెట్లెక్కినా ' చదివినప్పుడు కాస్త చిరాకేసింది. జీవితపు తెలుపునలుపులనే కాకుండా బూడిదరంగునీ ఆవిడ రాశారని ఆ తర్వాత కొన్ని యేళ్లకిగానీ అర్థమవలేదు. ఆవిడ రచనలు అన్నింటినీ ఈ రోజుకీ గౌరవిస్తాను.తను రాసిన ప్రతినవలా తన దృక్పథాన్ని మొత్తంగా చెప్పేయాలని ఆమె అనుకునేవారు కాదనుకుంటాను. ఒక్కొక్క పార్శ్వం గురించి, అదీ కొన్ని కోణాలనుంచే, రాసేవారనిపిస్తుంది.'కలలవెలుగు ' , ' ఏమిటీ జీవితాలు ' వంటి నవలని ఆవిధంగానే అర్థం చేసుకోవాలి . ఎంతమాత్రమూ ఎక్కడా నిలిచి ఆగిపోని రచన అది. ' జయ-లక్ష్మి' రాసిన,' శతాబ్ది సూరీడు ' రాసిన, హృదయనేత్రి ' రాసిన రచయిత్రే తక్కినవీ రాశారు. అన్నిటినీ కలిపే సూత్రం నాకయితే కనిపిస్తూనే ఉంటుంది. ఆమె పేరుకు హిందువు అయినప్పటికీ తొలినాటి రచనలలో క్రైస్తవమతపు ప్రశంస కనిపిస్తుంది.ఆ తర్వాత అలా కాకపోయినా సాంప్రదాయాల పట్టింపు కనిపించేది కాదు. ఇది ఆమె ఏదో ఒక వాదాన్ని సమర్థిస్తున్నట్లుగా కనిపింపజేయవచ్చు.అలా చూస్తే 'కాంచనమృగం ', ' వైశాఖి ' వంటి నవలలు అర్థం కావు.'రాగం అనురాగం' ఒక తెలివిగల మరదలు, చదువుకోని బావ..వీళ్ల కథ. ' భూమిపుత్రి ' ఒక సమర్థురాలయిన పల్లెటూరిఅమ్మాయికథ. ' సద్యోగం ' ఒక ఆడపిల్ల  అనాలోచితంగా చేసిన పొరబాటుని దిద్దుకున్న  తీరు . ఆ తర్వాత న్యాయవాదిగా నిలదొక్కుకునే ప్రయత్నంలో  మోసగించిన వ్యక్తినే వృత్తిరీత్యా రక్షించవలసివస్తే వెనకాడుతుంది. ప్రయత్నించి   ఆ పాతపరిచయస్తుడిని పూర్తి నిర్లిప్తంగా చూడగలిగే స్థితికి వస్తుంది. ఇందులో ఆమె సీనియర్ లాయర్ పాత్ర ఎంతగా, ఎలా ఉంటుందో చమత్కారంగా చూపిస్తారు. 'రాగరక్తిమ ' లో తనని కన్నవాళ్లకోసం తాపత్రయపడుతుంది సంపన్నుల ఇంటికి పెంపుడు వెళ్లిన అమ్మాయి. అయితే తన బాధ్యత తీరిపోగానే పెరిగిన ఇంటికే వెళ్లిపోతుంది. ఏ ఐడియలిజం కీ రచయిత్రి లొంగరు అక్కడ. 'కర్పూరపరాగం ' ఒక అందమైన అమాయక యువకుడి కథ. చురుకైన అమ్మాయి ఒకరు ఇస్కాన్ వంటిసంస్థలో చేరిపోయినఅతన్ని లాక్కొచ్చి పెళ్లిచేసుకుంటుంది.' మనసులోని మనసు ' చాలా ఛాయలు కనిపించే రొమాన్స్. ఆ నవలని పదే పదే చదివినవారు నాకు తెలుసు. ఏ చట్రంలోకీ ఇమడకుండా రాశారు ఆమె. ఆంగ్లసాహిత్యం ఆమెపైన బలంగా ప్రభావం చూపటం ఈ వైశాల్యానికి కారణం అనుకుంటాను. సోమర్సెట్ మాం చాలా ఇష్టం ఆవిడకి. ఇంకొకవైపున విశ్వనాథ, చలం ఇద్దరినీ అభిమానించారు తెలుగులో. జీవితం పట్ల, ప్రపంచం పట్ల ఆమెది సమగ్రమైన [holistic] దృష్టి. ఆమె విశ్లేషించిన క్లాసిక్స్ తో ఆమె రచనలను పోల్చలేము అనేమాటని విశ్వసించను.అంతా అక్కడే, అప్పుడే చెప్పేయాలనే తాపత్రయం లేని రచయిత్రి ఆమె. She really spoke some sense I believe !

2 comments:

  1. మనసులొని మనసు, కర్పూర పరాగం పదే పదే చదివినవాళ్ళలొ నేనూ ఉన్నాను. ఇప్పటికీ అర్దం కాదు ఎందుకు అన్ని సార్లు ఆ నొవెల్స్ చదివానో. మీరు రాసింది చదువుతుంటే బలే సంతొషం అనిపించింది, ఎదొ అనుబందం ఆమె రచనలతొ. నా teenage లొ చదివాను ఆమే నొవెల్స్. అమ్మ personal library లొ ఉండేవి ఆమె పుస్తకాలు. వంటలు పిండివంటలు, పాతకెరటాలు my mom used to read again and again. i am curious to know that Balaji Nagar's library's name ..:D

    ReplyDelete
    Replies
    1. బహుశా ఆ లైబ్రరీ నడిపినవారికి ఉద్యోగం వచ్చేసి ఉంటుందండీ. మాలతీ చందూర్ గారి రచనలు ఏకబిగిన , మళ్లీ మళ్లీ చదివించగలవి...ఆమె కౌన్సిలర్ గా, పరిజ్ఞానం అందజేసినవారుగా కంటె రచయిత్రి గానే నాకు ఎక్కువ ఇష్టం..

      Delete