Tuesday 5 November 2013

భ్రమరధ్వని

''నవ్వు చూడు తుమ్మెదకి, పువ్వు పువ్వు కోసమయి, ఆ ధూర్తపు కదలిక అంత ఝుమ్మంటూ ఉందెందుకు? పూగుత్తులకేమో బిడియం, కొత్త పెళ్లికూతుళ్లవి. ఏమిటి ఈ గాలిలో తేడా, అనురాగపు ఋతువు మారి అల్లరి చేసేలాగా? నువ్వూ నేనూ కానిది ఇంకేమీ లేదు ఇప్పుడు. ..అందుకు ఇక్కడి గాలి మోహం తో వీస్తూ ఉంది.... నీ పువ్వుల ఊసులతో దగ్గరవకు, ఊరుకోను. ఆ..తెలుసులే, తుమ్మెద కబురులు నువ్వు ఎందుకు వల్లిస్తున్నావో...! '' జగమంతా మత్తిల్లిన సందర్భం ఈ పాటది. మాటలదేముంది, అంత గాంభీర్యం ఏమీ లేదు.ఉన్న మాయాజాలమంతా సమ్మోహన స్వరాలదే. భ్రమరధ్వని మధుతీవ్రత సృష్టించిన ఎస్.డి ది, మాదకద్రవ్యం లాంటి రఫీ గొంతుది, ఆశా కంఠపు ముగ్ధలజ్జది. అచ్చమైన వలపు ఒక్క చనువును అడిగే చేరువ వస్తూ వస్తూ ఉంటే ఈ కోమల ఆహ్లాదం మనసుని ముంచెత్తుతుంది. డెబ్భయిల నాటి స్వచ్చత ...ఆ  ముద్దయిన తుంటరితనం అపుడూ ఇపుడూ ఒకటే. ఈ సినిమా లో మొదట వచ్చే యుగళ గీతం ' కోరా కాగజ్ థా ' తెలియని అన్వేషణ ఏదో ముగిసిన శుభఘటన అయితే ఇది ఆ తర్వాత రాగల సుందరతర పరిణామం. విజువల్స్ ముచ్చటగా ఉంటాయి. కాస్త ఇవతలగా నిలుచుని చూస్తూ ఉందామనిపిస్తుంది ...వీరెవరో దగ్గరి వారని, వీరి స్నిగ్ధ ప్రణయం ఇచ్చే ఆనందం నాది అని. ఒక్కసారి ఈ పాట జోలికి వెళితే అలా ఇంక వెంటాడుతుంది, నేను దీనికి అడిక్ట్ ని.


http://www.youtube.com/ watch?v=Ex3rRVqjV7IGun Guna Rahe Hai Bhanvare - Aradhana - - Asha Bhosle, Mohammad Rafi - Anand Bakshi - SD Burman www.youtube.comGun Guna Rahe Hai Bhanvare - Aradhana - Old Super Hit Hindi Video Song - Asha Bhosle,

No comments:

Post a Comment