Tuesday 5 November 2013

Pacific ocean

1980 లలో వ్యాకులత[melancholy] ఉండేది, అటువంటి సంగీతం, సినిమాలూ, పుస్తకాలూ నచ్చేవి. బహుశా అది I am not ok, you are not ok స్థితి. పదేళ్ల తర్వాత ఉద్వేగం, ఒరిపిడి అస్తమానమూ ఉండేవి. అది I am ok, you are not ok స్థితి అయి ఉండవచ్చును. ఇప్పుడు, గడిచిన కొన్ని యేళ్లుగా శాంతం తప్ప కోరదగినది లేదని తెలుస్తూ ఉంది. విశ్వనాథ వారి విమర్శలు ఈ మధ్య చదివినప్పుడు అందులో మహాభారతం శాంతరస ప్రధానం గా అభివర్ణించారు. అది ఏదీ పట్టకపోవటం కాదు, దాని అవతల ఏముందో కనిపిస్తూ ఉండటం అని నాకు అనిపిస్తుంది. జీవనం ఖచ్చితంగా అక్కడే పర్యవసించాలని నమ్మకం పెరిగింది. చాలా variables ని వేర్వేరు పద్ధతులలో మిళితం చేసి చూసుకుంటూ ఏయే కలయికలకి ఏ ఫలితం వస్తూ ఉందో అంచనా వేసుకోవటం..బహుశా గణితమే కావచ్చు , అది చాలా అవసరమయిన గణితం అని, ఒక శాస్త్రం అనీ నమ్ముతాను. ఇక్కడే శాస్త్రమూ కళా కలిసిపోయిన అస్తిత్వపు సాఫల్యాన్ని చూస్తున్నాను. చిన్నప్పటినుంచీ ఇప్పటిదాకా ఇష్టపడుతూ వచ్చిన పుస్తకాలలోప్రధానమైన   ' అమరావతి కథలు ' ఏ రసాన్ని ఆవిష్కరించాయో ఇప్పటికి అర్థమయింది. అందులోని ' తృప్తి-శాంతి ' , ' ఒక రోజెళ్లిపోయింది ' నాకు చాలా ముఖ్యమైనవి. మా అమ్మాయితో కలిసి చదువుకున్న LM Montgomery రచనలు శాంతరస ప్రధానమైనవి అని తను కనిపెట్టింది.
 వేగపు ప్రపంచానికి దూరంగా ఉన్నారు, మీకు అటువంటి ఒకరు తటస్థపడితే ఏం చేస్తారు? అని నాకు అప్పట్లో స్నేహితురాలయిన రచయిత్రి ఒకరు వేసిన ప్రశ్న కి సమాధానం నా మొదటి కథ ' నియతి '. నిజానికి అది నా కోణం లోనుంచి రాయాలని అనుకున్న కథ, అలా రాయలేదు. సంఘర్షించేవారి భాష లోనే సమాధానం చెప్పాలని అనుకున్నాను. ఆ కథ నాకు దగ్గరివారిలో ఒకరికి ఉపయోగపడింది కూడా. [ గొరుసు జగదీశ్వర రెడ్డి గారు మొన్న సారంగ లో ఆ కథనీ మారిందనిపిస్తున్న నా దృక్పథాన్నీ ప్రశ్నించినప్పుడు ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ] మొదటి రెండు కథలు రాసిన తర్వాత పదేళ్లపాటు ఏమీ రాయలేదు, అందరు మహా రచయితలు రచించి ఉన్నాక చెప్పవలసింది ఏమయినా ఉందని అనిపించలేదు.
ఇప్పుడు , ఫేస్ బుక్ ద్వారా చాలా మంది స్నేహితులని సంపాదించుకున్నాక , నా స్థిమితాన్ని ఎవరయినా ఆలకిస్తారని నమ్మకం వచ్చిన తర్వాత రాసినవి ఈ మధ్య కథలు రెండూ, ముఖ్యంగా క్షీరసాగరం. అది Pacific ocean , శాంత సముద్రం. రాయటమే నా ఉనికి కాదు...నా ప్రపంచం, అందులో వివిధవలయాలలోని నా వాళ్లు,సంగీతం,  చదవటం..ఇవన్నీ కలిపి నేను. ఆ జాబితాలోకి అందరూ virtual world అనే ఫేస్ బుక్ , సాహిత్యం గ్రూప్ వచ్చి చేరటం ఒక వింత. ఇది చాలా మంది అనుకునేటట్లుగా గుర్తింపు కోసం తపన అని నేను అనుకోవటం లేదు. ఒక సౌందర్యాన్ని కలిసి దర్శించటానికి ఎందరు తోడు ఉంటే అంత ఆనందం అనే తెలివిడి .

http://www.youtube.com/watch?v=ekef2Qq-VWY['' శాంతము లేక సౌఖ్యము లేదు''... భానుమతి గారు పాడిన త్యాగరాజస్వామి కీర్తన . ]

No comments:

Post a Comment