Tuesday 5 November 2013

క్షీరసాగర విహారి

మనకెంతో చేరువైన, చనువైన వారొక పెద్ద పదవిలో ఉన్నారు. వారి కార్యాలయానికి వెళ్లాము , పనేమీ లేదు, ముచ్చట కొద్దీ. మర్యాదగా సంబోధించాలి కదా అనుకుంటాము, గాంభీర్యం తెచ్చి పెట్టుకుంటాము. కాసేపటికి తడుతుంది, అక్కడ ' వారూ ' , మనమూ తప్ప మరి ఎవరూ లేరని...చటుక్కున అనేస్తాము '' ఓరి బంగారుతండ్రీ , ఎంత దర్జాగా ఉన్నావురా '' అని!!!

ఏడేడు లోకాలూ వాటి స్థితిలో అవి నిలిచి ఉండేందుకు కారణమైన ఉనికి అది. పరమ సాత్విక పయోజలధి లో అలవోకగా శయనించి ఉన్న సత్వగుణస్వరూపుడిని స్తుతిస్తూ ప్రారంభిస్తారు త్యాగరాజులవారు. కారు నలుపు తప్పులనెన్నో తుడిచిపెట్టగలవాడా, కౄరత్వానికి శత్రువు కావలసి వచ్చిన కారుణ్యమూర్తీ అని. వేదాలకి పరమావధీ ,సౌందర్యమూర్తీ [ఇక్కడ కాసింత చనువు వినిపిస్తున్నట్లుందే] నూరు యజ్ఞాలు చేసిగద్దెనెక్కినవాడిని పాపం, వేధిస్తున్నారెవరో, వారి పనిపట్టే స్వామీ,లయకారుడు ఆ కొండరేడు పొగడకతప్పని తండ్రీ !ఈ వరసలో ఆశ్రితుల మనసులలో కొలువుదీరినవాడా అనటంతో దగ్గరిదారి పట్టి, నువ్వు మా సీతాపతివే కాదూ అనేస్తారు. ఇహ ఆ తర్వాతి మాటలన్నీ తన సొంతమైన శ్రీరాముడితోనే, ఆ ముందరి ధోరణిని పూర్తిగా వీడనప్పటికీ ...

ఉత్సవ సంప్రదాయ కీర్తనలు అనే సంపుటిలో మొదట విన్నాను ఈ కీర్తన. ప్రతి వాక్యపు ఆపుదలా ఎంత సుతారంగా ఉంటుందో... అలా పాల సముద్రం లో చిన్ని కెరటం విరిగిపడుతూన్నట్లు. మెల్లిగా, చాలా మెల్లిగా అక్కడి శేషశయ్య ఊగుతున్నట్లు, రమణీయమయిన తూగు బాలమురళి గారి గొంతులో.కళ్లు తెరచి వినదలచినా సోలి మూతబడతాయి తప్పదు...లాలిపాట కూడా ఇది.

అందరికీ తెలిసిన ఐతిహ్యం- ఆనందభైరవి రాగాన్ని త్యాగరాజులవారు కూచిపూడి భాగవతులకు వదలిపెట్టారని... అంతకు ముందరిదేమో ఇది మరి. ఆ రాగలక్షణాలేవీ తెలియదు నాకు, అనిపిస్తూ ఉంటుంది, '' ఇంతకన్నానందమేమీ '' అని. వీనులు ఉన్నందుకు ఒగ్గటమే.


http://www.youtube.com/watch?v=91mTAPfkRlk

No comments:

Post a Comment