Tuesday 5 November 2013

మల్లినాథసూరి

మల్లినాథ సూరి గొప్ప వ్యాఖ్యాత,వైయాకరణి.ఈయన తెలుగు వాడని చెప్తారు.సంస్కృతం లో పంచకావ్యాలు అన్నిటికీ ఈయన రచించిన వ్యాఖ్యలు ప్రామాణికమైనవి.ఈయన ఇంటిపేరు కొలిచెల అనీ,13,14 వ శతాబ్దాల ప్రాంతం వాడనీ అంటారు.ఒక కథ ఉంది ఈయన గురించి. విద్వత్ కుటుంబం లో జన్మించాడు ,వివాహం కూడా అయింది.అయితే ఇంచుమించు నిరక్షర కుక్షిగా ఉండేవాడట .భార్య మంచి విద్వాంసురాలట.ముందే తెలియదో ఏమో,చాలా ఉక్రోషం వచ్చిందట ఆవిడకి.చూసి చూసి అన్నదట.. ''రూప యౌవన సంపన్నం కులశీల గుణ సంపదా విద్యాహీనం నశోభంతే ఫాలాశ కుసుమం వృధా '' [అందమూ,యవ్వనమూ,మంచి వంశంలో జన్మించటం,సత్ప్రవర్తన,ధనమూ ఎన్ని ఉన్నా విద్యలేని వాడు ప్రకాశించడు.మోదుగ పూవు వలె వ్యర్థుడు ] ఆయనకు ఆ మాత్రం సంస్కృతం వచ్చునో,లేదా అర్థమే చెప్పించుకున్నాడో..భావం తెలిసిపోయింది.రోషం వచ్చేసింది,ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. బహుశా కాశీకి. ఒక శాస్త్రం లో పండితుడవటానికి పన్నెండేళ్లు పట్టేది.కుశాగ్ర బుద్ధి కనుక ఆ వ్యవధిలో ఎన్నో శాస్త్రాలలో నిధి కాగలిగాడు. అప్పటికి ఇంటిమీద ధ్యాస తిరిగింది.తిరిగి వచ్చాడు. ఇక్కడ భార్య దీనమయిన స్థితిలో ఉంది.భర్తృవియోగ దుఃఖానికి తోడు తానే అతను అలా వెళ్లిపోవటానికి కారణం అని తెలిసిన పెద్దవాళ్ల సాధింపులు.ఈయన ఇల్లు చెరేసరికి చీకటి పడింది.ఆమె గడ్డమూ మీసాలూ ,పన్నెండేళ్ల వయస్సూ పెరిగి ఉన్న భర్తని గుర్తు పట్టలేదు.ఎవరో అభ్యాగతి అనుకుంది.ఆయన భోజనం కోసం అప్పటికప్పుడు వంట చేసింది.వడ్డిస్తూ ఉంది.చారు పోసింది.ఆమె మనసు వికలంగా ఉండటం చేత ఉప్పు వేయట మరచిపోయింది.ఆయన అందుకున్నాడు. '' చారు చారు సమాయుక్తం హింగు జీర సమన్వితం లవణ హీనం నశోభంతే ఫాలాశ కుసుమం వృధా ''[ఎంత శ్రద్ధతో ఇంగువ,జీలకర్ర వేసి కాచినా,ఉప్పు లేని చారు రుచిగా ఉండదు,మోదుగ పూవు వలె వృధా ] ఆమెకి ఒక్కసారిగా అర్థమయిపోయింది.పాదాల మీద పడి మన్నించమంది.అతను ఊరడించాడు,లేకపోతే నేను చదువుకునేవాడినా అన్నాడు .కథ సుఖాంతం. [సంస్కృతం చదువుకోలేదు,నా జ్ఞాపకం లోనుంచి రాస్తున్నాను.తప్పులు ఉంటే చెప్పగలరు]

No comments:

Post a Comment