Tuesday 5 November 2013

virataparvam 1

[బహుశా] కొడవటిగంటి కుటుంబ రావు గారు చందమామ లో చెప్పిన మహాభారతం ఆ కథ పైన రుచిని కలిగించింది మొదటగా. తర్వాత ఆ కథ ఆధారంగా తెలుగులో తీసిన సినిమాలు. విరాటపర్వం ఎక్కువగా నచ్చుతూ ఉండేది. 'రంజన చెడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా సంజయ విధినేమందును కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్ ' అని తెనాలి రామకృష్ణకవి అన్నా ఆ కథ ఆహ్లాదాన్నే కలిగిస్తూ ఉండేది . ఎందుకు అలాగ అని తర్కించుకోలేదు ఎప్పుడూ. ఈ మధ్యన ఆలోచిస్తూ ఉంటే కారణం తట్టింది. నేను అనుకున్న కారణాలే తితిదే వారి విరాటపర్వసంపుటం ముందుమాటలోనూ రాసిఉండటం సంతోషాన్ని కలిగించింది. సమర్థులూ తేజోవంతులూ అయినవారు తమ నిజస్వరూపాలను దాచుకునే ప్రయత్నం చేస్తూండగా అది పూర్తిగా నెరవేరక చూసేవారికి వీరెవరో ఉద్దండులు సుమా అనిపిస్తూనే ఉంటుంది. తాము నిజంగా ఎవరో వారినే ఇదివరలో సేవించి ఉన్నాము అని పాండవులూ ద్రౌపదీ చెప్పటం సరదాగా ఉంటుంది. ఇలా కథ నడపటంలో ఇతర పాత్రలకు తెలియనిది మనకి తెలుసు కదా అనే సంతోషం చదువరులకి. కీచకుడి వృత్తాంతం మొదట్లో బాధను కలిగించినా అతని సం హారం జరిగిపోయి తృప్తి పడతాము. ఆ తర్వాతి కథ ఏమయినా, అభిమన్యుడి జీవితం ఎలా పరిణమించినా అక్కడికి కల్యాణం గానే తోస్తుంది. తిక్కన గారి భారతరచన ఈ పర్వంతోనే మొదలయిందని గమనించాలి. ఆయన శిల్పలక్షణాలలో ముఖ్యమైన నాటకీయత గొప్పగా విస్తరించి చూపటానికి అనువైన పర్వం ఇది. చివరివరకూ అందరూ నటిస్తూనే ఉండే నర్తనశాల. విరాటపర్వం గురించిన  ప్రస్తావన కి కొనసాగింపుగా ఈ పద్యాన్ని చదవండి.కీచకుడు ద్రౌపది వెంటబడి పీడించటాన్ని చూసిన భీముడు విపరీతంగా కోపోద్రిక్తుడైనాడు. కీచకుడిని శిక్షించటానికి దగ్గరలో ఉన్న పెద్ద చెట్టును పెకలించబోతున్నాడా అనే ఘట్టంలో అంతటి ఆవేశం లోనూ అనుమతికోసం అన్నగారివైపు చూశాడట. అప్పుడు ధర్మరాజు
మ.వలలుండెక్కడ జూచె నొండెడ నసేవ్య క్ష్మాజముల్ పుట్టవే?
ఫలితంబై వరశాఖలొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగా
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపగా నేటికిన్?     అన్నాడు. ' ఇది నీకెక్కడ కనబడిందిరా, ఇంకేమీ దొరకలేదా ఏమిటి ? ' అని ' అని ఇప్పటికీ అంటాము కదా మనం. చదువుకున్న కుటుంబాలలో అలాంటి సందర్భం వచ్చినప్పుడు ' వలలుండెక్కడ చూచె ' అని వాడేవారట. భీముడి అజ్ఞాతవాసపు నామధేయం వలలుడని. ఫలవృక్షాన్ని వంటకట్టెల కోసం నరుకుంతావా అని నిగూఢంగా అంటున్నాడు. విరాటరాజుకి[ఆయన కీచకుడి పైన ఆధారపడి ఉన్నాడు] హాని తలపెట్టటం లోని తొందరపాటు తమకు నీడ లేకుండా చేస్తుందని. ఇక్కడ అసేవ్య వృక్షాలు [సేవింపదగని చెట్లు ] అంటే కౌరవులని , కోపంచూపవలసింది వారిమీదననీ తాత్పర్యమని పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గారి వ్యాఖ్యానమట. [ క్ష్మాజములు అంటే భూమి నుండి పుట్టినవి, చెట్లు .విలసత్ అంటే ప్రకాశిస్తూ ఉన్న. ఉపాశ్రిత ప్రతతి అంటే ఆశ్రయించిన జనసమూహం. ]

No comments:

Post a Comment