Tuesday 5 November 2013

పున్నాగ

కార్తీకమాసమూ పున్నాగపూలూ కలిసి ఇంటికొస్తాయి ప్రతి ఏడూ. ఈ పూలతో ఎన్ని పెనవేతలు ఉన్నాయో ! గుంటూరు నుంచి రేపల్లె వెళ్లే దారిలో పిట్టలవానిపాలెం అనే అందమయిన ఊరు ఉంది, వెలిగిపోయే ఆకుపచ్చ రంగులలో వేసిన బొమ్మ. ఒక నవంబర్ లో కొన్ని రోజులు అక్కడ గడిచాయి,
 కాలదేశపు రాకుమార్తె గుప్పెడు శాంతిని పిడికెడు  చలితో తో కలిపి అద్దుకునే ఋతువు అది. ఎంత కాగే మనసు అయినా కాస్త శమించి ఆగే సమయం
  .కొన్ని పూలు పొద్దున్నే విచ్చుతాయి, కొన్ని రాత్రికి. ఇవి ' పొద్దెక్కి ' విరిసే పూలు. వీటి వైభవం అప్పుడు మొదలయి రాత్రి సగం గడిచేదాకా. మధ్యాహ్నపు కునుకు తీసే కాలువ మీదికి నవ్వే పూవులు. గోరు వెచ్చని చిట్టి ఎండని ముద్దు చేస్తూ రాలే పూవులు. వెన్నెట్లో రాత్రి వేళ చుక్కల్లా ఊగే పూవులు.
    అప్పుడుండే ఇంటి ముంగిట నాటుకున్నామొక  మొక్కని, అమరావతి గుడి తోట లో అడిగి తెచ్చుకున్నాము..,ఎదిగి వృక్షమై ఏటేటా ఉత్సవాలు చేస్తుంటే చూసుకున్నాము, తప్పనిసరయి వదలి వచ్చాము.
 కొన్ని యేళ్ల వియోగం అంతమై ఇంకో రెండు మొక్కలు పెంచాము. చుట్టూ దడి కట్టాము, కాపాడాము, గోదావరి మట్టిసారం సాంద్ర సురభిళ పరిమళమైంది.
    రెండు చెట్లూ రెండు పూల మేడలు గాలిలో. ఒకతుఫాను  ఉదుటుకి ఒకటి కూలిపోయింది. ఏడ్చి ఊరుకోవటం కాదు, మోకులు కట్టి లేపాము. ఆశ వృధా అయిపోలేదు, ఆరుబయటి ఆలయం లో పూజ ఆగి పోలేదు.

5 comments:

  1. మైథిలీ , స్వాగతం. బ్లాగు చూడగానే సంతోషమేసింది.

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులయింది శైలజా నువ్వు మాట్లాడి...నీ కథ మొదటి భాగం చదివాను :)

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. పూలన్నిట్లోకి పున్నాగ పూలంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పట్నించి . ఆ సువాసన మనసును ఎక్కడికో తీసుకెళ్ళుతుంది. గుంటూరు, కొత్తపేట లోని అలేకస్వామి గుడిలో ఈ చెట్లు ఉండేవి. వీటిని అందరూ ధయిర్యంగా పెంచక పోవడానికి కారణం ఇవి ఎక్కడ ఉంటే అక్కడ పాములు కూడా ఉంటాయని ప్రతీతి. మా ఎలిమెంటరీ స్కూలు కూడా అక్కడే కావడం మూలాన వీలున్నప్పుడల్లా క్రింద రాలిన వాటిలో ఫ్రష్ గా వున్నా పూలను ఏరుకొని గుప్పెదనిండా పట్టుకొని తృప్తిగా చూసుకొంటూ వాటిలో కొన్నిటిని సన్నాయిలాగా ఊదుకొంటూ ఇంటికి వచ్చే వాళ్లము.

    ReplyDelete
    Replies
    1. మీ జ్ఞాపకాలను రేపగలిగినందుకు ఆనందంగా ఉందండీ !

      Delete