Tuesday 5 November 2013

రమ్యమైన అపహరణ

పదోతరగతి లో మాకు పాఠ్యాంశంగా ఉండేది ఈ ఘట్టం.విని ఆ జగన్మోహనుడి మీద మనసు పారేసుకున్నాను . బహుశా అప్పుడే శ్రీకృష్ణపాండవీయం సినిమా చూశాను. అందులోని అతిరమణీయమైన చిత్రీకరణ తెలుగు వారికి పట్టిన అదృష్టాలలో ఒకటి. రుక్మిణి ముగ్ధత్వం,సమర్పణ...శ్రీకృష్ణుడి   మధురౌద్ధత్యం   , స్వీకరణ..ప్రాణం పోసుకున్న దివ్యప్రణయం...ఒకేసారి ఒకరు ప్రేమికుడూ భగవంతుడూ కూడా అవటం ఇదిగో, ఇలా ఉంటుంది. చదవండి ఒక్కసారి, చూడండి ఆ పద్యం వరకూ అయినా ' పోతన్న కైతలన్ని పోత పోసుకున్నవాడిని '!


కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం,గంఠీరవేంద్రావల గ్ను,నవాంభోజదళాక్షు, జారుతరవక్షున్,మేఘసంకాశ దే హు,నగారాతి గజేంద్రహస్త నిభబాహుం, జక్రి బీతాంబరున్ ఘనభూషాన్వితు, కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్! (దశమస్కన్దము,పూ.భా. 1752-రుక్మిణీ కళ్యాణ ఘట్టం)
తనను రాక్షస వివాహము చేసుకొనడానికి వచ్చిన శ్రీకృష్ణుని రుక్మిణీదేవి కనుగొన్నప్పటి ఆయన రూపాన్ని పోతన గారు పైవిధం గా ఆమెకు చూపారు . చంద్రమండలము వంటి చల్లని కాంతిప్రసరించే ముఖము గలవానిని, సింహము వంటి నడుము కలవానిని,అప్పుడే వికసించిన తామరల వంటి కన్నులు గలవానిని, గొప్ప ఉరము కలవానిని, నీలమేఘమువంటి శరీరము గలవానిని, దేవేంద్రుని ఏనుగు ఐరావతపు తొండమువంటి బలిష్టమైన బాహువులు గలవానిని,చక్రాయుధముపట్టి న వానిని,పసుపువన్నె పట్టుధోవతి ధరించినవానిని,  గొప్ప ఆభరణములు ధరించినవానిని, అందమైన శంఖము వంటి మెడ గలవానిని, విదర్భ రాజ్యపు సేనలను వోడించి తనను గొనిపోవ వచ్చిన జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని రుక్మిణీ దేవి కనుగొన్నది.http://www.youtube.com/watch?v=kyC8wpxUhYo

No comments:

Post a Comment