Tuesday 5 November 2013

పారిజాతం





రాత్రి కొంత గడిచాక సర్జరీ నుంచి ఇంటికి రాగానే ఎవరో ఆత్మీయులు అకస్మాత్తుగా వచ్చిఉన్నట్లనిపించింది. చూస్తే తోటలో పారిజాతం పూసింది. ఇంత చిన్ని తెల్లని పూవు, అంత ఎర్రని పగడాలవంటి కాడలు. ప్రవాళనాళిక అని ఒక పేరు దీనికి. సౌరభం...నాసికద్వారా హృదయం లోకి ధమనులలో పరువులెత్తి అల్లుకొని ఉనికి మొత్తాన్నీ కదిపి లోపలి వెన్నెలయిపోతుంది. మరచిపోయామేమో అనుకున్న వేదనలు, కాలం గడిచిన మీదట తీయనైనవి...స్ఫురిస్తాయి, అసలు అనుభవానికే రాని సౌందర్యాలు వాటివెంట లాక్కుపోతాయి. ప్రతి శరత్తులోనూ ఈ పుష్పాల కారుణ్యం నన్ను తడిపి పరిశుభ్రం చేస్తుంది, ఇంచుమించు నాకు నేను నచ్చేటంతగా. మహాభావుకుడయిన ముత్తాత ఒకరు పారిజాతం విరగబూసిన రోజున పక్కనే ఒక్కరూ వాలు కుర్చీలో రాత్రంతా నిద్ర పోకుండా గడిపేవారట. ఆ రాత్రి గడిచిపోతే మళ్లీ అంత వైభవంగా రాదూ అని. నిద్రపోతే ఆ పూవులకి అవమానం అని .

No comments:

Post a Comment