Tuesday 5 November 2013

ద్రౌపది నవ్వు?

ఎవరయినా జారిపడితే చూసేవారు ఎందుకు నవ్వుతారు?అది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య [reflex ] వంటిది.పడినవారు రోగగ్రస్తులూ,వృద్ధులూ కానప్పుడూ,ఆ పడిన పద్ధతి ఎక్కువ హాని కలిగించేదిగా తోచనప్పుడూ అలా నవ్వు రావటానికి ఏ ఆటంకమూ ఉండదు.ఒక్క లిప్త లో ఇన్ని భావనలు ఒక ప్రేరణ ని ప్రభావితం చేస్తాయా అనే సందేహం అవసరం లేదు.ఇలాంటివాటిని 'కండిషండ్ రిఫ్లెక్స్ 'లు అంటారు.ఆ పడిన వారి ప్రవర్తన గతంలో తమపట్ల సరిగాలేనప్పుడు నవ్వును ఆపుకోవాలనీ అనిపించదు. వాకిలి పత్రికలో వచ్చిన సామాన్య గారి కథలో ఒక 'పక్షి ' కథ చెప్తున్నవారిని చూసి ద్రౌపది కామవాంఛ తో దుర్యోధనుడిని చూసి మోహంతో నవ్వినట్లు నవ్విందని రాశారు. తన భావాన్ని అర్థం చేసుకోలేని దుర్యోధనుడి మూర్ఖత్వానికి ద్రౌపది శపించుకుని వుంటుందని కూడా తీర్మానించారు.ఆ కథ లోని 7,8 పేరాగ్రాఫ్ లని చూడండి. ఏ' పక్షి ' ఎవరిని చూసి ఎలాగయినా నవ్వవచ్చ్హును.ద్రౌపది ప్రసక్తిని తీసుకురావటానికి ఆధారం ఎక్కడనుంచి వచ్చింది? వ్యాసభారతం అనువాదం..సభాపర్వం..''నీళ్లల్లో  పడిన సుయోధనుని చూసి భీమసేనుడు నవ్వాడు.అతని పరిచారకులూ నవ్వారు.రాజుగారి ఆజ్ఞ ప్రకారం అతనికి పొడిబట్టలు ఇచ్చారు .ఆ స్థితిలో ఉన్న అతనిని చూచి భీమార్జున నకుల సహదేవులు కూడా బాగా నవ్వారు. '' నన్నయ్య గారి మహాభారతం సభా పర్వం ద్వితీయాశ్వాసం...''.....స్ఫటిక దీప్తిజాల పరివృతంబయినజలాశయంబు   స్థలంబుగా వగచి కట్టిన పుట్టంబు దడియంజొచ్చి,క్రమ్మరిన వానిన్ జూచి పాంచాలియు,పాండుకుమారులును నగిరంత. నన్నయ్య గారు మూలంలో లేని కల్పనని చేసి ద్రౌపది పాత్ర ఔచిత్యాన్ని తగ్గించారనిపించినా,ఆమె భర్తలతో కలిసి నవ్విందనే ఇందులో ఉంది. సామాన్య గారి కల్పన చాలా బాధాకరం గా ఉంది.

No comments:

Post a Comment