Tuesday 5 November 2013

నా విశ్వనాథ



ఆయనకీర్తిశేషులైన  నాటికి నావయసు పది సంవత్సరాలు..ఆస్థానకవి అని తప్ప ఇంకా ఏమీ తెలియదు .తర్వాతి కాలంలో విన్నది ఆయనను గురించి వ్యతిరేకోక్తులనే... చదివిన తొలి నవల చెలియలికట్ట మనస్సుకెక్కనూలేదు పదిహేడేళ్ల వయసులో. స్వైరం లో మాత్రమే సౌందర్యం చూసే అజ్ఞానం అప్పటికి,   నియమాలెందుకు ఎట్లా ఆవశ్యకమో తెలియదు.
 గుంటూరు నవోదయా బుక్ స్టోర్ లో ఒక పై అరలో పెద్ద పెద్ద పుస్తకాలు.. సముద్రపు దిబ్బ, మ్రోయు తుమ్మెద కనిపిస్తూ ఉండేవి. తీసుకుందామనిపించినా భయం వేస్తూ ఉండేది చదవగలనా అని. [ కొన్ని యేళ్ల తర్వాత వెళ్లి పిచ్చిదానిలాగా అడిగాను ఆపుస్తకాలేమయినాయని. అక్కడివారెవరికీ గుర్తే లేదట. ]చిన్నగా కనిపించిన నాస్తికధూమం, హెలీనా తీసుకున్నాను. ప్రయాసతో చదివాను.అవి  అసలేమి చెప్తున్నాయో . అంతుపట్టలేదు. ఏకవీరలోని వేదన అర్థరహితమనీ అనుకున్నాను. ఒక్క హా హా హూ హూ మాత్రం ఆకర్షించింది.
కష్టపడి సంపాదించి వేయిపడగలూ చుట్టబెట్టీ ఒక్క దీవెనా పొందలేదు, అప్పటికింకా బహుశా అది సమయం కాదు.

వివాహమై, బిడ్డల తల్లినయి, ఇరవై ఆరేళ్లు నిండుతూన్నప్పుడు , 1992 లో మళ్ళీ మొదలుపెట్టినప్పుడు తెలిసిందని అనిపించింది ఉద్గ్రంథం ఏమిటో, ఎందుకో. పదే పదే ప్రతిదినమూ పారాయణ వంటిది చేసి, నా చుట్టూ లోకాన్నంతా మరి ఇంకొకలాగా చూసి, వెతకటం మొదలుపెట్టాను ఇంకా ఏమేమి చెప్పారని. తిరిగి ఏకవీర, సిం హళ రాజకుమారుడి స్నేహఫలము..అంతే.
ఒక ఉత్తరం రాశాను ' గ్రంథకర్త కుమారులకి '  'అమ్మా, నమః అని ప్రారంభించి జవాబు ఇచ్చారుపావని   శాస్త్రి గారు.
ఆయన ఇల్లంటూ ఒకటి ఉందని ఆశ్చర్యపడుతూ వెళ్లి  చూశాను. ఇక్కడ పడక, ఇక్కడ జపం, ఇక్కడ రచన...హృదయంలో కైమోడ్చాను.
శాస్త్రిగారి పితృప్రేమ ఎన్నదగినది..   ఆధునిక పాఠకులకు విశ్వనాథని పరిచయం చేయాలనే తాపత్రయంతో. పులిమ్రుగ్గుని సరళవ్యావహారికంలో తిరగరాసి ఉన్నారు.అచ్చులోలేని పుస్తకాలని అందుబాటులోకి తేవాలనే గట్టి తపన. చిన్న కథల సంపుటిని
ముందుగా  వేశారు. మెల్లిగా చారిత్రక నవలలు అన్నీ ప్రచురించారు. మంగళగిరి లో ఉద్యోగం చేస్తూ ఉండే మా నాన్నగారు ఒక మంచిరోజున విజయవాడనుంచి కట్టను మోసుకొచ్చారు మా ఊరికి. అన్నిటినీ అతురనై పదిరోజులలో ముగించాను. పురాణవైర గ్రంథమాల మొత్తమూ, కాశ్మీర, నేపాళరాజవంశ నవలలూ, ధర్మ చక్రము, కడిమిచెట్టు వంటి ఇతరాలూ వాటిలో ఉన్నాయి.  భారతదేశ చరిత్రని స్పర్ధతో, కూటనీతితో, ఆంగ్లేయులు ఎట్లా మార్చారో కొన్ని వారాలపాటు అందరికీ చెప్పుకున్నాను. ప్రతిపుస్తకపు వెనక అట్టమీద ఇంకా దొరకని పుస్తకాలు కనిపించేవి.
 తె ఱ చిరాజు, స్వర్గానికి నిచ్చెనలు , పాతవి, వంశీ  బుక్ స్టాల్ లో దొరికాయి.[ స్వర్గానికి నిచ్చెనలు మూడోసారికి గాని అర్థమవలేదు. తె ఱ చిరాజు ఇంకా మొత్తం తెలియలేదు. ] దేవతల యుద్ధము, పులుల సత్యాగ్రహము, నర్తనశాల నాటకం కూడా  పాతవి అక్కడే దొరికాయి.

 కోవెల సంపత్కుమారాచార్య గారు వేసిన రూపకాలు- సంపాదకీయాలు, పీఠికలు దొరికాయిసరిపోలేదు.
ఈలోపు పావనిశాస్త్రి గారు దివంగతులైనారు. రచన లో ' సీత ' రాశారు అచ్యుతదేవరాయలు. ఒకేసారి ప్రౌఢమూ సుకుమారమూ
అయిన వ్యక్తీకరణలో, శ్రీవిద్యాన్వయంలో, వాక్యాల విరుపులో తండ్రిగారు దర్శనమిచ్చారనిపించింది. వేయిపడగలు లోని చిన్న రామేశ్వరశాస్త్రి కదా వారు.. చాలా కాలం క్రితం 'కైక ' కూడా రాశారు . వారి  వెంటబడి నందమూరు వెళ్లాను. ఆయన ఇల్లుండిన వీధి, చుట్టూ మాగాణి, వేయిపడగలు లోని వేణుగోపాలస్వామి గుడి, విశ్వనాథ శోభనాద్రిగారు ప్రతిష్టించిన ' మా స్వామి ' విశ్వేశ్వరుని ఆలయం...అన్నీ తిరిగాను. అచ్యుతదేవరాయలను అడిగాను ' మీరచన మీ తండ్రిగారిదివలె ఉంటుందికదా ' అని. ఆయన అంగీకరించలేదు, తన పైన నన్నయ్య గారి ప్రభావం మాత్రం ఉందన్నారు. ' మీరు నాన్న పోలికా అమ్మ పోలికా ' అని అడిగాను...' మా అమ్మ పోలికే మొత్తం ' అన్నారు సగర్వంగా. ప్రాణం ఉసూరుమన్నది. ఆయన చిన్నప్పుడు తండ్రికి దూరమయి బంధువుల ఇంట్లో పెరిగారని జ్ఞాపకం వచ్చి ' అయ్యో ' అనిపించింది. అయినా వారిని అడిగాను పుస్తకాలు  వేయండీ అని. అక్కడే ఉన్న పెద్ద వయసు రైతు ఒకరి నోటివెంట విశ్వనాథ వారి ఆకార విశేషాలను విని కాస్త శమించాను.
  తర్వాత సంవత్సరం న్నర కి దొరికాయి మొత్తం నవలలూ, నాటకాలు, నాటికల సంపుటులు. వారసులు ప్రచురించారు. అమితమైన ఉత్కంఠతో ఎదురుచూసి పెట్టెలని ఇంటికి తెచ్చుకున్న రోజు ఇప్పటికీ గుర్తు ఉంది.
తెలుగు ఋతువులు,  వరలక్ష్మీ త్రిశతి, కిన్నెరసాని పాటలు వంటి కొన్ని టిని మినహాయిస్తే నా పరిజ్ఞానం తొంభయి శాతం వచనరచనల పైన ఆధారపడినదే. కల్పవృక్షం ఛాయలోకి నెమ్మదిగా ప్రయాణిస్తున్నాను.
మొత్తం నవలలూ నాచేతికి వచ్చేనాటికి డ్యూమాస్ ని, డికెన్స్ ని, విక్టర్ హ్యూగో ని, జార్జ్ ఇలియట్ ని, జేన్ స్టిన్ ని సందర్శించాను, ఇంకా కొందరు స్రష్టలను కూడా. వీరెవ్వరూ విడివిడిగా ఒక్కరూ విశ్వనాథ తో సరి తూగలేరు. కొంతమంది కలిస్తే, కొన్ని చోట్ల..ఏమో ! షేక్స్పియర్ ను నేను చదవలేదు కనుక ప్రస్తావన చేయను.
మాస్తి వేంకటేశ అయ్యంగార్ కంటే, శివరామ కారంత్ కంటే, కల్కి కృష్ణమూర్తి కంటే, ఎం.టి.వాసుదేవన్ నాయర్ కంటే... నవలా రచనలో విశ్వనాథ గొప్పవారు...[ నేను చదివినవి అనువాదాలే అయినా.] ఆయా రచయితలను ప్రజలు ఎట్లా ఔదలదాల్చారో ఒక్కసారి గమనిస్తే....

No comments:

Post a Comment