Tuesday 5 November 2013

sindhubhairavi

నేను వింటూనే గుర్తు పట్టగలిగే రాగాలు చాలా తక్కువ. పాట అంతా విని వెనక్కి తరచి చూసుకోవటం వరకే వచ్చు. అలా తెలుసుకున్న రాగం సింధు భైరవి. మొదటిసారి ఎస్.బాలచందర్ గారు వీణ పైన వాయించిన సుబ్రహ్మణ్యభారతి రాగమాలిక ప్రారంభంగా ఆకర్షించింది.ఎంతగా అంటే రాత్రీ పగలూ సుడులు తిరుగుతూ ఉండేది మనసులో, గొంతులో. ఎస్.బాలచందర్ గారి వాదన విలక్షణమైనది అంటారు... నావరకు నాకు అతి ప్రౌఢంగా, ధీమాగా వినిపిస్తుంది . ఆ పాట ' తీరాద విలయాట్టు పిళ్లై ' ...ఇంకా చాలామంది పాడారు, వాయించారు. [ రజనీకాంత్ ' శివాజీ ' సినిమాలో ' నీ ఆటలిక చాలులేరా ' అనే పాట ట్యూన్ అదే ] తర్వాత విన్నది ఉన్నికృష్ణన్ గారు పాడిన ' వెంకటాచల నిలయం ' ...ఈ కృతి మనస్సును దాటి మరింకెక్కడో మ్రోగుతుంది నాకు. స్థాయీభావం నా నిర్వచనానికి అందదు...ఆర్తి,వేదన, అర్పణ,ఆనందం...ఇవి ఏవీ కావు, అన్నీ అవును. తర్వాత తర్వాత నా అస్తిత్వానికి ఆటపట్టుగా అయిపోయినదెందుకో కూడా అర్థమవదు. బాలమురళిగారు ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రయాగ రంగదాసుగారి ' రామరామ యనరాదా ' ఎన్ని సార్లు విన్నానో. ఆయన పాటని ఇ.గాయత్రి గారు వీణ పైన మీటినా అంత కమనీయంగానూ ఉంటుంది. సింధుభైరవిలో కొన్ని జానపద ఛాయలు మిళితమయి ఉండటం వలన సంగీతం తెలియనివారూ అర్థం చేసుకొని సంతోషించగలుగుతారని చదివాను. అవునా? ఏమో. సంగీత త్రిమూర్తులయిన త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు..వీరెవరూ ఈ రాగంలో కృతులు చేయలేదని  విన్నది నిజమో కాదో తెలియదు. ' వెంకటాచలనిలయం ' పురందరదాసులవారిది.సదాశివబ్రహ్మ ేంద్రుల ' చేతహ శ్రీరామం ' , స్వాతి తిరుణాళ్ మహారాజుల ' రామచంద్ర ప్రభో ' కొంత ప్రసిద్ధమైనవి. భీంసేన్ జోషి, బాలమురళీకృష్ణ గార్ల వంటి ఉద్దండులతో రూపొందించిన జాతీయసమైక్యతా గీతం ' మిలే సుర్ మేరా తుం హారా ' సింధుభైరవిలో చేశారు. మేరా నాం జోకర్ లోని ' జీనా యహా మర్ నా యహా ' కూడా. ఇళయరాజా చాలా పాటలు చేశారని తమిళులు నిర్వహించే బ్లాగ్ లలో చూశాను.నేను గుర్తు పట్టగలిగినది ' వసంతకోకిల ' లోని ' ఈలోకం అతిపచ్చన ' మాత్రమే.విశ్వనాథ వారి ' స్వర్గానికి నిచ్చెనలు ' ఇలా ముగుస్తుంది. ' పశుపతిశాస్త్రి వెన్నెలలో చాప వేసికొని వీణ వాయించుచుండెను.హిందుస్తాని తోడి రాగమును వాయించుచుండెను. ఈ రాగమును ముత్తుస్వామి దీక్షితారు తీసికొని వచ్చెనట. దీనికి సింధుభైరవి అని ఇంకొక పేరు గలదు. షడ్జమము, శుద్ధ రిషభము,సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కైశికీ నిషాదము-ఈ స్వరసంపుటిచేతనే యీ రాగము సర్వమైన విషాదభావమును మూర్తి కట్టినట్లుండును.అవరోహణారోహణముల లో చతురశ్రుతి రిషభమును ప్రతిమధ్యమమును కలుగుచున్నవి. సాధారణ గాంధారమునుండి షడ్జమమునకు చేరినప్పుడెల్ల ప్రాణములు తేలిపోవుచుండెను.వసుంధర యొక్క సర్వవిషాద చరిత్రయు నా చేరుటలో కనిపించుచుండెను.ఓహో!ఏమి రాగము!ఆ సాధారణగాంధారము నుండి షడ్జమమునకు చేరిన ధ్వనిలో శ్రీరాముడు సీతను వనవాసమునకు పంపినట్లు, నలుడు దమయంతి చీర చించికొని పోయినట్లు, ద్రౌపదీ వస్త్రాపహరణము జరిగినట్లు, పుత్ర వియోగార్త యయిన తల్లి దుఃఖించినట్లు, పరమేశ్వరానుగ్రహము లేక జీవితమంతయు శిధిలమైనట్లు, హృదయములో దిగులు పుట్టుచుండెను.అంత దుఃఖమయమైన ఆ శృతులలో వెనుకనొక మాధుర్యమునందు పర్యవసించినట్లు, సర్వదుఃఖము ననూహితమైన యొక శాంతభావము నందు పర్యవసించుచుండెను. ఆ! ఆ! ఆ శాంతిని పట్టుకొనవలయును!!!
[ సాహిత్యం గ్రూప్ లో ఈ వ్యాసాన్ని పోస్ట్ చేసినప్పుడు మిత్రులద్వారా  తెలుసుకున్న( సింధుభైరవి లో  చేసిన ) పాటలు...' భార్యాభర్తలు ' లో ' ఏమని పాడెదనో ' , గుండమ్మకథ లో ' చల్లగ వీచే పిల్లగాలికి ' , 'ఉయ్యాల-జంపాలలో ' ఏటిలోని కెరటాలు ' ]  http://www.youtube.com/watch?v=TdBH-QSdThA&list=PL69842C0247FBFCAC [ML VASANTAKUMARI]

http://www.youtube.com/watch?v=bGUJyQuWxiA [BALAMURALIKRISHNA ]

http://www.raaga.com/play/?id=227505 [E.GAYATHRI]

http://www.youtube.com/watch?v=FmQ9wvOmj8s [NITYASRI MAHADEVAN]
 

No comments:

Post a Comment